Breaking News

ప్రతిపక్ష నేత అరెస్ట్: ఆందోళనలతో అట్టుడుకుతోన్న రష్యా.. అరెస్టయిన 2,500 మంది!


ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని విడుదల చేయాలంటూ జరుగుతోన్న ఆందోళనలతో రష్యా అట్టుడుకుతోంది. నావల్నీని అన్యాయంగా నిర్బంధించి జైల్లో పెట్టారని, తక్షణమే నుంచి విడుదల చేయాలనే డిమాండ్‌తో రష్యాలోని అన్ని నగరాల్లో ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీలు చేపట్టారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా వేలాదిగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. నిరసకారులను నిలువరించేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనేక చోట్ల ఆందోళనకారులు చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో మాస్కో, సెర్బియా, నోవోసిబిర్సిక్, యెకాటెరిన్బర్గ్, యుజ్నో-సఖాలిన్స్క్‌ సహా మొత్తం 90 నగరాల్లో 2,500 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో నావల్నీ భార్య యూలియా కూడా ఉన్నారు. అయితే, ఆమెను కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. 2014లో నావల్నీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఆగస్టులో ఆయనపై విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. విషప్రయోగం తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. కొద్ది రోజులు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుని క్రమంగా కోలుకున్నారు. ఆగస్టు 20న సైబీరియాలోని తామ్‌స్క్‌ నుంచి మాస్కోకు వస్తున్న సమయంలో ఆయనపై విషప్రయోగం జరిగింది. ఇదిలా ఉండగా.. జర్మనీ నుంచి జనవరి 17న స్వదేశానికి వచ్చిన నావల్నీని మాస్కో విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. ఆందోళనకారుల అరెస్ట్‌ను అమెరికా, బెల్జియం తీవ్రంగా ఖండించాయి. దీనిపై తదుపరి చర్యల గురించి సోమవారం చర్చించనున్నట్టు ఐరోపా విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బొరెల్ అన్నారు. రష్యాలోని మొత్తం 100 నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గతంలో 2012, 2019లోనూ ప్రతిపక్షాల ఆధ్వర్వంలో భారీ నిరసనలు చేపట్టారు. వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రతిపక్షాల సామర్ధ్యానికి ఇదో పరీక్ష అని విశ్లేషకులు అంటున్నారు. తమను చెదరగొట్టడానికి ముందు ప్రదర్శనకారులు క్రెమ్లిన్ వైపు ర్యాలీగా బయలుదేరారు. ఒకానొక సమయంలో మాస్కో సర్కస్ మెట్లపై సామూహికంగా సెల్‌ఫోన్ లైట్లు వెలిగించి, స్నో బాల్స్‌తో పోలీసు వ్యాన్‌పై దాడిచేశారు. క్రిమినల్స్ యూనిఫామ్ ధరించి నేరస్థులను రక్షిస్తున్నారని ఆందోళనల్లో పాల్గొన్న 71 ఏళ్ల వ్యక్తి ఆరోపించాడు. పుతిన్, ఒలిగార్చ్‌లు తమ పదవులను కోల్పోతారని భయపడుతున్నారని దుయ్యబట్టారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులు, జర్నలిస్ట్‌లపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. నావల్నీని అరెస్ట్ చేయడం, 2,500 మందికిపైగా అతని మద్దతుదారులను అదుపులోకి తీసుకోవడం చూస్తే భవిష్యత్తులో పౌర సమాజం, రాజ్యాంగ స్వేచ్ఛపై నిర్బంధం కొనసాగుతుందనడానికి సంకేతమని ప్రైస్ మండిపడ్డారు. ఈ నిర్బంధాన్ని కెనడా సైతం తీవ్రంగా ఖండించింది.


By January 24, 2021 at 03:08PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/protesters-demands-release-of-opposition-leader-alexei-navalny-over-2500-arrested-in-russia/articleshow/80433444.cms

No comments