దేశంలో మరో 20 మందికి యూకే స్ట్రెయిన్ నిర్ధారణ.. 58కి చేరిన కేసులు
దేశంలో బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి కొత్తరకం కోవిడ్ స్ట్రెయిన్ కేసుల సంఖ్య 58కి చేరింది. యూకే కరోనా స్ట్రెయిన్ కేసులు మంగళవారం మరో 20 నమోదయినట్టు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో బాధితులను సింగిల్ రూం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు నిమ్‌హాన్స్ (బెంగళూరు)లో 10, సీసీఎంబీ (హైదరాబాద్) 3, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(పుణే) 5, ఐజీఐబీ (ఢిల్లీ) 11, ఎన్‌సీడీసీ (ఢిల్లీ) 10, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినోమిక్స్ (కోల్‌కతా) కళ్యాణి ల్యాబ్‌లో ఒక కేసు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అలాగే, సీడీఎఫ్‌డీ-హైదరాబాద్, ఐఎల్ఎస్-భువనేశ్వర్, ఎన్‌సీసీఎస్-పుణే, ఎన్‌సీబీఎస్, ఇన్‌స్టెమ్ (బెంగళూరు)లో నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నిర్ధారణ కాలేదని తెలిపింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తుల నమూనాలను సేకరించి, ఇండియన్ సార్స్-కోవి-2 జినోమిక్ కన్సార్టియం ల్యాబ్‌ల్లో పరీక్షిస్తున్నట్టు పేర్కొంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశామని తెలిపింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల కాంటాక్టులను ట్రేస్ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వారితో కలిసి ప్రయాణించిన వ్యక్తులు, కుటుంబసభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించింది. మరోవైపు.. దేశంలో సాధారణ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 16,375 కేసులు బయటపడ్డాయి. గతేడాది జూన్ నెలాఖరు తర్వాత ఇన్ని తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. మహమ్మారికి మరో 201 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి తరుణంలో యూకే వైరస్ స్ట్రెయిన్ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది.
By January 05, 2021 at 01:09PM
No comments