Breaking News

స్వర్గంలో ఉన్నట్టుంది.. పాక్ నుంచి 18 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగుపెట్టిన మహిళ


పాకిస్థాన్ జైల్లో 18 ఏళ్ల పాటు మగ్గిన ఓ భారతీయ మహిళ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. భారత గడ్డపై అడుగు పెట్టగానే స్వర్గంలోకి వచ్చినట్లు ఉందని పేర్కొంది. పాకిస్థాన్‌లో తాను చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. ఆమెను విడిపించడానికి సాయం చేసిన మహారాష్ట్ర పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. ఇంతకీ ఆమె పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లింది? పోలీసులు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ వివరాలు.. ఔరంగ‌బాద్‌లోని రషీద్‌పురాకు చెందిన హ‌సీనా బేగం 18 ఏళ్ల కిందట త‌న భ‌ర్తకు సంబంధించిన బంధువులను కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లింది. దురదృష్టవశాత్తూ లాహోర్‌లో ఆమె పాస్‌పోర్టు మిస్సయ్యింది. దీంతో ఆమెను పాక్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు అభియోగాలు మోపి జైలుకు పంపారు. ‘నాకే పాపం తెలియదు సార్..’ అని మొరపెట్టుకున్నా అక్కడి అధికారులు కనికరించలేదు. హ‌సీనా బేగం అదృశ్యమైనట్లు ఆమె బంధువులు 18 ఏళ్ల కిందట ఔరంగాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె పాకిస్థాన్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. పాక్ పోలీసు వ‌ర్గాల‌కు లేఖ రాశారు. దీంతో ఆమె ఆచూకీ ల‌భ్యమైంది. ఆమె అక్కడి జైల్లో ఉన్నట్లు పాక్ వ‌ర్గాలు తెలిపాయి. ఆ విషయం తెలిసిన తర్వాత ఆమెను విడిపించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసుల కృషి ఇన్నేళ్లకు ఫలించింది. హసీనా బేగంను పాక్ అధికారులు విడుదల చేశారు. కిందటి వారం ఆమెను భారత అధికారులకు అప్పగించారు. స్వదేశానికి చేరుకోగానే ఆమెకు బంధువులు ఘన స్వాగతం పలికారు. ‘స్వదేశానికి రావ‌డంతో నా మనసుకు చాలా ప్రశాంతత కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. పాకిస్థాన్‌లో ఇన్ని రోజులు అనేక క‌ష్టాలు పడ్డాను. ఇప్పుడు ఇకక్కడి గాలి పీల్చుకోవ‌డంతో సంతోషంగా ఉంది. ఔరంగాబాద్ పోలీసుల‌కు కృత‌జ్ఞత‌లు’ అని హ‌సీనా అన్నారు. హసీనా తన ఇంటికి చేరుకోవడంతో పాక్‌లోని ఆమె బంధువులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హసీనా బేగం వయసు 65 ఏళ్లు.


By January 27, 2021 at 03:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/65-year-old-woman-freed-from-pakistani-jail-returns-to-india-after-18-years/articleshow/80479351.cms

No comments