Breaking News

ఢిల్లీ అల్లర్ల వెనుక పంజాబీ నటుడు.. ప్రధానితో ఉన్న ఫొటో వైరల్, ఇదేం కుట్ర?


ఢిల్లీలో రైతులు చేపట్టిన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పరేడ్‌లో అప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చిన కొంత మంది రైతులు ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్రకోటను ముట్టడించారు. చారిత్రక కట్టడంపై రైతు జెండాలను ఎగరేశారు. అనుమతి లేని అనేక మార్గాల ద్వారా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఘర్షణలు చెలరేగి దేశ రాజధాని అట్టుడికిపోయింది. ఈ ఘర్షణల్లో 300 మంది పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వందలాది మంది రైతులు కూడా గాయపడ్డారు. దేశ రాజధానిలో రిపబ్లిక్ డే రోజున జరిగిన ఈ ఘటన అంతర్జాతీయం భారత్ ప్రతిష్టను మసకబార్చేవిధంగా మారింది. ఈ ఘటనపై రైతు సంఘాల నేతలు స్పందించారు. ఇది తమ పనికాదని, ర్యాలీలో విద్రోహ శక్తులు చేరి అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధానంగా ఓ పేరు తెరపైకి వచ్చింది. పంజాబ్‌కు చెందిన దీప్ సిద్ధూ పేరు వినిపిస్తోంది. అతడి కారణంగానే ఈ అల్లర్లు జరిగాయా? అతడికి ఆ అవసరం ఏముంది? కీలక వివరాలు.. పంజాబీ నటుడిగా దీప్ సిద్ధూకు మంచి గుర్తింపు ఉంది. పంజాబ్‌తో పాటు పలు హిందీ సినిమాల్లోనూ నటించారు. నటుడిగానే కాకుండా గాయకుడుగానూ దీప్ సిద్ధూకు గుర్తింపు ఉంది. ఎర్రకోట ఉద్రిక్తతలకు ఇతడే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అతడికి నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. దీప్ సిద్ధూ ఆది నుంచే ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నాడు. రెండు రోజుల కిందట మరోసారి ఢిల్లీకి వచ్చినట్లు సమాచారం. సింఘు సరిహద్దుల్లో రైతుల ఆందోళనల్లో పాల్గొన్న సిద్దూ.. కర్షకులను రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పరిణామాలకు సిద్ధూనే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులను ఆయన రెచ్చగొట్టారని చెబుతున్నారు. ‘మా ఉద్యమాన్ని కించపరిచేందుకు కొన్ని సంఘ విద్రోహశక్తులు చేరాయి. ఎర్రకోటపై జెండాలు ఎగరవేయాలనేది మా ప్రణాళికలో లేదు’ అని కిసాన్‌ మజ్దూర్ సంఘర్ష్‌ కమిటీ నేత ఎస్‌ఎస్‌ పందేర్‌ అన్నారు. ప్రధానితో సిద్ధూ.. ఆయనపై అనుమానాలున్నాయి! ఎర్రకోట ఘటన అనంతరం దీప్ సిద్ధూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక ఫొటోలో దీప్ సిద్ధూ.. ప్రధాని మోదీతో ఉన్నారు. సిద్ధూపై తమకు అనుమానాలున్నాయని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ‘దీప్‌ సిద్ధూ సిక్కు కాదు. ఆయన బీజేపీ కార్యకర్త. ప్రధానితో కలిసి ఉన్న ఆయన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది రైతుల ఉద్యమం. బారికేడ్లను ధ్వంసం చేయడం మా ఉద్యమంలో భాగం కాదు. అదంతా విద్రోహుల పని’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ అన్నారు. ‘జరిగిన ఘటనలపై ఉద్యమంలో ఒక భాగస్వామిగా సిగ్గుపడుతున్నా.. వాటికి బాధ్యత వహిస్తా’ అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం (జనవరి 26) జరిగిన కిసాన్‌ పరేడ్‌లోనూ సిద్ధూ ఎర్రకోట వద్ద కనిపించి అందరికీ షాకిచ్చాడు. ఎర్రకోట ప్రాంగణంలో రైతులు తమ జెండాలతో పాటు నిశాన్‌ సాహిబ్‌ జెండాలను ఎగరేసిన సమయంలో దీప్ సిద్ధూ అక్కడే ఉన్నాడు. జెండాలు ఎగరేసిన తర్వాత కొంత మంది రైతులు దీప్ సిద్ధూను ఛేజ్ చేయగా అతడు పారిపోయాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. సినీ నేపథ్యం ఉన్న సిద్ధూ గత కొంత కాలంగా రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీ దేవోల్‌ తరఫున ఎన్నికల ప్రచారం చేశాడు. ఆయన సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను దీప్ సిద్ధూ ఖండించాడు. సోషల్‌ మీడియాలో ఓ వీడియో సందేశం పెట్టాడు. ‘అంతమంది రైతులు ఎర్రకోట వెళ్లేలా నేను ఎలా ప్రోత్సహించగలను. ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తున్నట్లు ఉన్న ఒక్క వీడియో కూడా లేదు’ అని అన్నాడు. మరోవైపు.. ఆందోళనకారులను ఎర్రకోటపైకి వెళ్లేందుకు ప్రోత్సహించినట్లు, సోషల్ మీడియాలో పంజాబీ యువకులను రెచ్చగొట్టేలా పోస్ట్‌లు చేసినట్లు పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయనకు నోటీసులు కూడా పంపించినట్లు సమాచారం. రైతుల ఆందోళన వ్యవహారంలో దీప్ సిద్ధూకు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ కావడం గమనార్హం.


By January 27, 2021 at 04:51PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/punjabi-actor-deep-sidhu-role-under-scrutiny-after-tractor-rally-violence/articleshow/80480311.cms

No comments