Breaking News

స్కూల్‌కి వెళ్తే రోజుకు రూ.100, ఇంటర్ ఫస్ట్‌క్లాస్‌లో పాసైతే స్కూటీ: బీజేపీ ప్రభుత్వం బంపరాఫర్!


గైర్హాజరు కాకుండా రోజూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినిలకు అసోం ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. తరగతులకు క్రమం తప్పకుండా హాజరయ్యే బాలికలకు రోజుకు రూ.100 ప్రోత్సహకం అందజేయనున్నట్టు అసోం విద్యాశాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ ఆదివారం ప్రకటించారు. అలాగే, పుస్తకాలు కొనుగోలు చేసుకోడానికి డిగ్రీ విద్యార్థులకు రూ.1,500, పీజీ చదువుతున్నవారికి రూ.2,000 జనవరి నెలాఖరులో నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులను ఆకర్షించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, గతేడాది నుంచి ఈ పథకం అమలు చేయాలని భావించినా, కరోనా వైరస్ కారణంగా సాధ్యం కాలేదని మంత్రి అన్నారు. కాలేజీ, స్కూల్స్‌కు వెళ్లే విద్యార్థినిలకు ప్రోత్సాహకం అందజేయనున్నామని మంత్రి బిశ్వ శర్మ తెలిపారు. గతేడాది ఇంటర్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన బాలికలకు శివసాగర్‌లో స్కూటీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకవేళ ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో లక్ష మంది బాలికలు ఉత్తీర్ణులైనా స్కూటీలను ప్రభుత్వం అందజేయనుందని హామీ ఇచ్చారు. ఈ ఏడాది 22,245 మంది విద్యార్థినులకు స్కూటీల కోసం రూ.144.30 కోట్ల ఖర్చు చేయనున్నామని మంత్రి తెలిపారు. అలాగే, 2018లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 5,000 మందికి, 2019లో ఉత్తీర్ణులైన 10,000 మందికి కూడా ద్విచక్రవాహనాలను అందజేయనున్నట్టు వివరించారు. ‘అమ్మాయిలు, అబ్బాయిలను ఒకేలా చూడాలి.. చాలా మంది తల్లిదండ్రులు అబ్బాయిలు తమను బాగా చూసుకుంటారనే ఆలోచనతో ఆడపిల్లలకు త్వరగా వివాహం చేసేస్తున్నారు.. ఈ ఆలోచన విధానంలో మార్పు రావాలి’ అన్నారు.


By January 04, 2021 at 12:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/assam-govt-to-give-financial-incentives-to-girls-rs-100-every-day-to-attend-school/articleshow/80093153.cms

No comments