కాబోయే భర్తకి ఆమె ఫొటోలు, మాజీ ప్రియుడి పైశాచికం.. సూర్యాపేటలో విషాదం
ప్రేమించిన యువకుడి పద్ధతి నచ్చక అతని నుంచి విడిపోయినా అతను వదల్లేదు. ఆమెను వెంటాడాడు. ఆమెకు పెళ్లి కుదిరిందని తెలిసి పైశాచికంగా ప్రవర్తించాడు. తనతో ఉన్న ఫొటోలను పెళ్లికొడుక్కి, అతని బంధువులకు పంపడంతో పీటల వరకూ వెళ్లకుండానే పెళ్లి ఆగిపోయింది. అది అవమానంగా భావించిన యువతి అఘాయిత్యం చేసుకుంది. ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయింది. జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు.. జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురానికి చెందిన యువతి(21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జీఎన్‌ఎంగా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వంశీ, యువతి కొద్దికాలం ప్రేమించుకున్నారు. అయితే అతని పద్ధతులు నచ్చకపోవడంతో ఆమె అతనితో తెగతెంపులు చేసుకుని దూరం పెట్టింది. యువతి తల్లిదండ్రులు మరొకరితో వివాహం నిశ్చయం చేయడంతో పెళ్లికి ఒప్పుకుంది. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటోందని రగిలిపోయిన మాజీ ప్రియుడు వంశీ పైశాచాకానికి దిగాడు. ఆమె తనతో ఉన్న ఫొటోలను వరుడు, అతని కుటుంబ సభ్యులకు పంపించడంతో పెళ్లి రద్దయింది. దీంతో హైదరాబాద్‌లో ఉన్న యువతిని తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి తీవ్రంగా మందలించారు. కొద్దిరోజులు సూర్యాపేటలోని బంధువుల ఇంట్లో ఉండమని చెప్పి పంపించారు. ఈ నెల 6వ తేదీన సూర్యాపేట చింతలచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె 9 వ తేదీన బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. ఇంటి నుంచి బయటికెళ్లిన కూతురు తిరిగిరాలేదని తెలిసి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిమ్మాపురం గ్రామ పొలాల్లో యువతి మృతదేహం పడి ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించగా యువతి విగతజీవిగా కనిపించింది. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెళ్లి ఆగిపోయేలా చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన వంశీ, అతనికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By December 16, 2020 at 10:49AM
No comments