అందరికీ ఫ్రీ టీకా: ఆమోదం తెలిపిన నితీశ్.. ఎన్నికల హామీని నిలబెట్టుకున్న బీజేపీ


బిహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ‘అందరికీ ’ హామీని బీజేపీ నిలబెట్టుకుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. నితీశ్ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులోనే అందరికీ వ్యాక్సిన్ అన్న దానిపై ఆమోద ముద్ర వేశారు. బిహార్‌లోని ప్రతి వ్యక్తికీ ఉచితంగా కరోనా వైరస్ అందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోంవర్క్ చేయాలని సీఎం నితీశ్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ‘అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిచే పద్ధతులపై అధ్యయనం చేస్తున్నాం. తొలుత వైద్య ఆరోగ్య కార్యకర్తలకు టీకా అందిస్తాం. దీనిపై సమగ్ర విధానంతో త్వరలోనే ప్రజల ముందుకు వెళ్తాం’ అని ఓ అధికారి తెలిపారు. అలాగే 60 ఏళ్లు దాటినవారికి తర్వాత 50 ఏళ్లవారికి అందజేయనున్నాం. ఎన్నికల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. దీనిపై అప్పట్లో చాలా దుమారమే రేగింది. బిహార్ డిప్యూటీ సీఎం తార్‌కిశోర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి ఉచితంగా టీకా ఇవ్వాలని నిర్ణయించాం.. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చిన పెద్ద కానుక.. మానవ వనరులే బిహార్‌కు అతిపెద్ద బలం.. వారిని ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకుంటాం’ అన్నారు. ఒక్కసారి టీకాకు ఆమోదం లభించి, అందుబాటులోకి వచ్చిన తర్వాత పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉచిత టీకా పంపిణీ నిర్ణయాన్ని మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ స్వాగతించారు. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాలని ఆయన సూచించారు. ఇక, వచ్చే ఐదేళ్లల్లో ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని క్యాబినెట్‌లో నిర్ణయించారు. సాంకేతిక విద్యను హిందీ భాషలోనూ అందజేయాలని తీర్మానించారు. ఇంటర్ పూర్తిచేసిన బాలికలకు 10వేల నుంచి 25వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతకలు 25వేల నుంచి 50వేల వరకు నగదు ప్రోత్సాహానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. యువతలో వ్యాపారాన్ని ప్రోత్సహించేలా రూ.5 లక్షల వరకు రుణసదుపాయం కల్పించి, ఇందులో 50 శాతానికిపైగా సబ్సిడీ అందజేసే పథకంపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.


By December 16, 2020 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chief-minister-nitish-kumar-approves-free-coronavirus-vaccine-for-all-in-bihar/articleshow/79753113.cms

No comments