Breaking News

సీఎం పదవిపై నితీశ్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీకి పరోక్షంగా హెచ్చరికలు!


సీఎం పదవిపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పీఠంపై తనకు ఆసక్తిలేదని వ్యాఖ్యానించారు. జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న కొద్ది గంటల్లోనే నితీశ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. జేడీయూ పగ్గాలను ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రామచంద్ర ప్రసాద్ సింగ్‌కు నితీశ్ అప్పగించిన విషయం తెలిసిందే. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ మాట్లాడుతూ... తనకు ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం లేదని అన్నారు. బీహార్‌లోని తమ మిత్రపక్షం బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి కుర్చీకి అంకితం కాలేదని, వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించలేనని ఎన్డీఏలోని పార్టీలకు స్పష్టం చేశానని అన్నారు. అయితే, ఇందుకు వారు అంగీకరించకపోవడంతో చాలా ఒత్తిడి తర్వాత తాను మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని అన్నారు. ఈ పదవి పట్ల తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని, సీఎం పదవి అవసరం లేదని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీని వీడి రెండు రోజుల కిందట బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌డీఏ కూటమిలోని జేడీయూ-బీజేపీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. ఈ నేపథ్యంలో నితీశ్ తాజా ప్రకటన ప్రాధాన్యత ఏర్పడింది. ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఎంతో వ్యధకు గురిచేస్తోందని జేడీయూ సీనియర్‌ నేత కేసీ త్యాగి అన్నారు. కూటమి రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు మంచివి కావని ఆయన వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంపై గుర్రుగా ఉన్న జేడీయూ.. బిహార్‌లో మింగలేక కక్కలేక లోలోన రగిలిపోతుంది. మిత్రపక్షంగా ఉంటూనే తమ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై బీజేపీ తీరును పరోక్షంగా తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిపై తనకు మోజులేదని పరోక్షంగా బీజేపీకి నితీశ్ సంకేతాలు పంపుతున్నారు.


By December 28, 2020 at 11:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-cm-nitish-kumar-drops-bombshell-after-quitting-as-jdu-chief/articleshow/79987549.cms

No comments