Breaking News

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేళ రాహుల్ విదేశీ పర్యటన.. టార్గెట్ చేసిన బీజేపీ


కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ.. విదేశీ పర్యటనకు వెళ్లడంతో మరోసారి ఆయనను టార్గెట్ చేసింది. కాంగ్రెస్ 136వ ఆవిర్భావ వేడుకలను కార్యకర్తలు జరుపుకుంటే.. ఆ పార్టీకి ఎంతో ముఖ్యమైన రోజున రాహుల్ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారంటూ? బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 136 ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంటే... రాహుల్ మాత్రం అదృశ్యమయ్యారు అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్లారు.. కొద్ది రోజులు ఆయన అందుబాటులో ఉండరు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. అసమ్మతి నేతలతో సోనియా గాంధీ భేటీ అయిన కొద్ది రోజుల తర్వాతే రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడం గమనార్హం. ఇదిలా ఉండగా తన సోదరుడి విదేశీ పర్యటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రియాంక గాంధీ నిరాకరించారు. బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. ‘తన అమ్మమ్మను చూసేందుకు రాహుల్ గాంధీ వెళ్లారు.. ఇదేమైనా తప్పా? ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా పర్యటించే హక్కు ఉంది.. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది.. ఒక నాయకుడిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నందున వారు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు’అని మండిపడ్డారు. పీటీఐ వార్త సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఖతార్ ఎయిర్‌లైన్ విమానంలో ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ ఇటలీలోని మిలాన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, రాహుల్, సోనియా విదేశీ పర్యటనలపై తరుచూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో సోనియా, రాహుల్ ఇటలీ పర్యటనపై పార్లమెంట్‌లోనే బీజేపీ ఎంపీలు విమర్శలు గుప్పించారు. ఇటలీ నుంచి వచ్చిన వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలి.. వారి వల్ల వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.


By December 28, 2020 at 12:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-rahul-gandhi-abroad-misses-party-foundation-day-bjp-taunts-again/articleshow/79988274.cms

No comments