జీన్స్, టీషర్ట్స్ మాత్రమే కాదు అలాంటి చెప్పులు వేసుకోవద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్!
ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి తమకు నచ్చిన వస్త్రాలు ధరించి కార్యాలయానికి రావడానికి వీల్లేదని మహరాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ తీసుకొచ్చింది. విధులకు జీన్స్, టీషర్ట్ ధరించి రావద్దని, శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ నిబంధన వర్తిస్తాయని పేర్కొంది. డిసెంబరు 8న మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వస్త్రధారణకు సంబంధించి మార్గదర్శకాలను జారీచేసింది. కొందరు ఉద్యోగులు, సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గ దుస్తులు ధరించడం లేదని, దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చులకన భావం ఏర్పడుతోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యక్తిత్వం, మంచి ప్రవర్తనను ప్రజలు ఆశిస్తారని తెలిపింది. ఉద్యోగులు అనువుకాని, శుభ్రతలేని దుస్తులు ధరించడం వల్ల దాని ప్రభావం పనిపైనా పడుతోందని అభిప్రాయపడింది. అందుకే పరిశుభ్రమైన, యోగ్యమైన వేషధారణలో కనిపించాల్సి ఉంటుందని సర్క్యులర్ పేర్కొంది. మహిళా ఉద్యోగులైతే చీరలు, సల్వార్/ చుడిదార్స్ కుర్తాస్, ట్రౌజర్ ప్యాంట్స్ ధరించొచ్చని తెలిపింది. పురుషులుమాత్రం షర్ట్, ప్యాంట్స్ ధరించాలని, వేసుకునే చెప్పులు సైతం హుందాగా ఉండాలని సూచించింది. బొమ్మలు, ఎంబ్రాయిడరీ వర్క్స్, మరీ ముదురు రంగు ఉన్న షర్ట్స్ కూడా ధరించరాదని.. ముఖ్యంగా జీన్స్, టీషర్ట్‌కు దూరంగా ఉండాలని పేర్కొంది. అలాగే చేనేతను ప్రోత్సహించేందుకు వారంలో శుక్రవారం ఒకరోజు ఖాదీ వస్త్రాలను ధరించాలని సర్క్యులర్ జారీ చేసింది. మహిళా ఉద్యోగులు సాండల్స్, బూట్లు, చెప్పులు.. పురుష ఉద్యోగులు షూ, పాదరక్షలు వేసుకోవచ్చు. స్లిప్పర్లు ధరించేందుకు అవకాశమే లేదు. గతేడాది తమిళనాడు సర్కారు సైతం రాష్ట్ర ఉద్యోగులంతా సంప్రదాయ వస్త్రాల్ని ధరించాలని డ్రెస్‌కోడ్ తీసుకొచ్చింది. సెక్రటేరియట్‌లో పనిచేసే పురుష ఉద్యోగులు షర్టు, ఫార్మల్ ఫ్యాంట్లు; మహిళా ఉద్యోగులు చీర లేదంటే దుపట్టాతో ఉన్న చుడీదార్.. సల్వార్ కమీజ్‌లు ధరించాలన్న ఆదేశాలు జారీ చేశారు.ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు.. అందుకు తగ్గట్లే హుందాగా వస్త్రధారణ ఉంటే బాగుంటుందని పేర్కొంది.
By December 12, 2020 at 08:31AM
No comments