Breaking News

మెడికల్ పీజీ చేస్తే పదేళ్లు ప్రభుత్వాస్పత్రిలో పనిచేయాలి.. లేకపోతే రూ.కోటి కట్టాల్సిందే


పీజీ మెడికల్ విద్యార్థులకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు చర్చనీయాంశమవుతున్నాయి. పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన మెడికల్ విద్యార్థులు తప్పనిసరిగా పదేళ్లపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది. అలాకాని పక్షంలోరూ.కోటి పరిహారంగా చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ కోర్సు పూర్తి చేసిన తర్వాత సీనియర్‌ రెసిడెంట్‌షిప్‌ చేయడానికి కొంత మంది నిరభ్యంతర పత్రం కోరుతున్నారని, ఇక నుంచి దీనికి అనుమతివ్వబోమని.. వారు తిరిగి తమ విభాగాల్లో చేరాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘పీజీ కోర్సు పూర్తయిన తర్వాత ప్రభుత్వ విభాగాల్లో పదేళ్లు పనిచేయడం తప్పనిసరి.. లేకపోతే కోటి రూపాయలు జరిమానా చెల్లించాల్సిందే’ అని యూపీ అదనపు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ తెలిపారు. అంతేకాదు, మూడేళ్ల పాటు కోర్సు నుంచి డిబార్ చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య నిపుణుల కొరత ఉండటంతో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 15వేల మంది వైద్యుల పోస్టుల సృష్టించామని, ఇప్పటి వరకు 11,000 మంది చేరారని యూపీ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేర్కొన్నారు. ఇక, ఎంబీబీఎస్‌ పూర్తిచేసి గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్ల విధులు నిర్వర్తించేవారి నీట్ పీజీ పరీక్షలో కొన్ని మార్కులు కలుపుతామని తెలిపింది. రెండేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులకు 20 పాయింట్లు, మూడేళ్ల అనుభవం ఉన్నవారికి 30 పాయింట్లు నీట్‌లో అదనంగా కలుపుతామని పేర్కొంది.


By December 14, 2020 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-govt-tell-medical-students-work-in-public-sector-for-at-least-10-years-or-pay-rs-1-crore/articleshow/79713134.cms

No comments