Breaking News

‘చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా’.. బీజేపీ నేతలపై మమత సంచలన వ్యాఖ్యలు


పశ్చిమ్ బెంగాల్ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై గురువారం దాడి జరిగిన విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్‌ హార్బర్‌కు వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై గుర్తుతెలియని రాళ్లతో దాడిచేశారు. ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలు, నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. పలు కార్లు, మీడియా వాహనాలు ధ్వంసమయ్యాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో ప్రయాణిస్తున్న నడ్డా క్షేమంగా బయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ గూండా రాజ్యంగా తయారైందని నడ్డా ధ్వజమెత్తారు. దుర్గామాత అనుగ్రహంతో సురక్షితంగా బయటపడ్డానన్నారు. ఈ దాడి అధికార టీఎంసీ గుండాల పనేనని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి వారికి బుద్ది చెబుతుందని నడ్డా ఆరోపించారు. నడ్డాపై దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న శాంతి భద్రతల సమస్యపై తక్షణమే నివేదికను పంపాలని గవర్నర్‌ను కేంద్ర హోం శాఖ కోరింది. ఇదిలా ఉండగా బీజేపీ ఆరోపణలపై సీఎం ఎదురుదాడికి దిగారు. నడ్డాపై దాడి ఓ డ్రామా అని, అంతా పథకం ప్రకారమే జరిగిందని విరుచుకుపడ్డారు. ‘ఇది ఓ చిన్న సంఘటన.. ఇందులో ఎవరున్నారో తెలియదు.. కానీ, ఓ టీ దుకాణం వద్ద 50 కార్లతో ఉన్న మీ కాన్వాయ్‌ ఎవరిని ఎవరైనా ఢీకొట్టవచ్చే లేదా విసిరేయవచ్చు.. లేదా ప్లాన్ ప్రకారం చేయవచ్చు.. ఇక జరిగింది చాలు మీ అబద్దాలను మేము సహించం.. దాడిలో ఏదైనా కుట్ర ఉండి ఉంటే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తారు’ అని మమత కౌంటర్ ఇచ్చారు. ‘మీ వెంట సీఐఎస్ఎఫ్-బీఎస్ఎఫ్ కమాండోలు ఉన్నప్పుడు వారు మీ కారుపై ఎలా దాడిచేస్తారు? షాట్ గన్స్‌తో తిరిగే మీ పార్టీ వ్యక్తుల మాటేంటి?’ అని నిలదీశారు. ‘వారు కొత్త హిందూ ధర్మాన్ని దిగుమతి చేసుకుంటున్నారు.. ఆ హిందూ ధర్మం మన హిందూ ధర్మం కాదు.. వారి హిందూ ధర్మం రోత పుట్టించే ధర్మాన్ని దాటిపోతోంది.. దాని వల్ల మీకు లేదా నాకు ఏమీ ఒరగదు.. ఈ విధంగా హిట్లర్ హిట్లర్ అయ్యాడు.. ఈ విధంగానే సియోసేస్కు సియాస్కే అయ్యాడు.. ముస్సోలినీ ముస్సోలినీ అయ్యాడు... ఈ రోజు, ఈ నరేంద్ర బాబు సర్కార్ కేవలం నాటకాన్ని ప్లాన్ చేస్తుంది.. నాటకాన్ని సృష్టిస్తుంది.. తాము సృష్టించిన డ్రామా వీడియోను మీడియాకు పంపుతుంది.. వారిని ప్రశ్నించే శక్తి మీడియాకు లేదు.. తమ సొంత నాటకాన్ని మీడియాకు పంపుతారు’ అని మమత దుయ్యబట్టారు. ‘ప్రతిరోజూ బీజేపీ కార్యకర్తలు తుపాకీలతో బయటకు (ర్యాలీలకు) వస్తున్నారు. తమను తాము చెంపదెబ్బ కొట్టుకుని ఆ నిందలు తృణమూల్ కాంగ్రెస్‌పై వేస్తున్నారు. పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి.. బీస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్‌ సైన్యం మీ వెంట ఉంటే ఎందుకు భయపడుతున్నారు?’ అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు భద్రత కల్పించాలని స్థానిక ప్రభుత్వాన్ని ఎందుకు కోరలేదన్నారు. మీవైపు తప్పు ఉంచుకుని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘వారికి (బీజేపీ) వేరే పని లేదు.. కొన్నిసార్లు హోంమంత్రి ఇక్కడకు వచ్చారు.. ఇతర సమయాల్లో చద్దా, నడ్డా, ఫడ్డా, భద్దా ఎవరో వస్తారు... సభలకు జనం రానప్పుడు.. తమ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పుతారు’అని మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.


By December 11, 2020 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-cm-mamata-banerjee-slams-bjp-chief-jp-nadda-due-to-allegations-on-convoy-attack/articleshow/79672496.cms

No comments