ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ నిపుణుల కమిటీ ఆమోదం
ఫైజర్ ఫార్మా తయారుచేసిన టీకా అత్యవసర వినియోగం కోసం చేసిన దరఖాస్తుపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సలహా మండలి గురువారం సమావేశమయ్యింది. ఎఫ్‌డీఏ ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ఫైజర్-బయోఎంటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ వినియోగానికి అనుకూలంగా తీర్మానం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్‌లో ఫైజర్ నివేదికకు అనుకూలంగా 17 ఓట్లు, వ్యతిరేకంగా నాలుగు, ఒకరు తటస్థంగా ఉండిపోయారు. దీంతో వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపిన రోజుల వ్యవధిలోనే దీన్ని ప్రజలకు అందిస్తారు. ఇందుకు ఇప్పటికే రంగం సిద్ధమవుతోంది. అమెరికా చరిత్రలోనే భారీస్థాయిలో కరోనా టీకా కార్యక్రమం చేపట్టనున్న తరుణంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు ఆధారంగా ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్ -19 టీకా 16 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో ముప్పును తప్పిస్తుందా? అనేది పరిశీలించామని నిపుణుల కమిటీ తెలిపింది. ‘ఫైజర్ టీకా విషయమై ఎఫ్‌డీఏ బృందం శాస్త్రీయ న్యాయస్థానంలా విచారణ చేపడుతోంది. వ్యాక్సిన్ సురక్షితమేనా? ఎలాంటి దుష్ప్రభావాలుంటాయి? దీని పనితీరు ఎలా ఉంది? అత్యవసర వినియోగానికి ఇది యోగ్యమైనదేనా? అన్న విషయాలను లోతుగా చర్చిస్తారు. ఇందుకు సంబంధించి ప్రయోగ పరీక్షల డేటాను విశ్లేషిస్తారు’ అని ఎఫ్‌డీఏ ఉన్నతాధికారి డోరన్ ఫింక్ తెలిపారు. ఇక, నిపుణుల సమావేశాన్ని ఎఫ్‌డీఏ యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. నిపుణులు, బయోస్టాటిస్టీషియన్లు, ఇతర శాస్త్రవేత్తలతో సహా స్వతంత్ర నిపుణులు, పరిశోధకుల నివేదికకు ఎఫ్‌డీఏ కట్టుబడి ఉండదు.. కానీ, రాబోయే రోజుల్లో ఈ సిఫారసులను ఎఫ్‌డీఏ అనుసరిస్తుందని భావిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో 44 వేల మందికి ప్రయోగాత్మకంగా టీకా అందించిన ఫైజర్, ఫలితాలను నమోదు చేసింది. టీకా ప్రభావవంతంగా పనిచేస్తోందని, ఎవరిలోనూ పెద్దగా దుష్ప్రభావాలు కనిపించలేదని నిపుణులు గుర్తించారు. అయితే- హెచ్‌ఐవీ, ఇతర వైరస్‌లతో బాధపడుతున్నవారిలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గర్భిణులకు ఈ టీకాను సిఫార్సు చేయొచ్చా? అన్న విషయాలపై నిపుణులు లోతుగా చర్చిస్తున్నారు.
By December 11, 2020 at 08:07AM
No comments