కమలం జాతీయం చిహ్నం.. బీజేపీ గుర్తును వెనక్కు తీసుకోండి: అలహాబాద్ హైకోర్టులో పిల్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/79672279/photo-79672279.jpg)
రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులను దుర్వినియోగం చేస్తున్నాయని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అలహాబాద్ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. బీజేపీకి కేటాయించిన కమలం గుర్తును కూడా ఉపసంహరించుకోవాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరాడు. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోవింద్ మాథుర్, జస్టిస్ పియూష్ అగర్వాల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 12కు వాయిదా వేసింది. బీజేపీకి ఎన్నికల గుర్తుగా కేటాయించిన కమలాన్ని ఉపసంహరించుకోవాలంటూ యూపీలోని గోరఖ్‌పూర్‌కు చెందిన కాళీ శంకర్ గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ‘కమలం’ జాతీయ పుష్పమని, పలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో అది కనిపిస్తుంటుందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి ఆ గుర్తును ఎన్నికల్లో వాడుకోడానికి ఏ పార్టీకీ అనుమతించవద్దని కోరారు. ఆ చిహ్నాన్ని ఉపయోగించుకునే పార్టీకి అనుచిత లబ్ధి చేకూరుతుందని ఆయన చేసిన విజ్ఞప్తిని గతేడాది ఏప్రిల్ 4న ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ పార్టీలకు కేటాయించిన గుర్తులను కేవలం ఎన్నికల సమయంలోనే ఉపయోగించుకోవాలని.. వాటిని లోగోలుగా వాడుకునేందుకు అనుమతించకూడదని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రాతినిధ్యం చట్టం, ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్లు, కేటాయింపు) ఆర్డర్ 1968 ప్రకారం.. గుర్తుల కేటాయింపు భావన అనేది కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, వాటిని రాజకీయ పార్టీలు లోగోలుగా వాడుకోరాదని చెబుతుందని ప్రస్తావించారు. అంతేకాదు, గుర్తులను అన్నివేళలా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తే.. స్వతంత్ర అభ్యర్థులు, ఏ పార్టీతోనూ సంబంధం లేని వ్యక్తులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ఎన్నికల గుర్తుల వినియోగానికి సంబంధించి తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈసీఐ తరఫున హాజరైన న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమ స్పందన తెలియజేయడానికి సమయమివ్వాలని అభ్యర్థించారు. ఇతర రాజకీయ పార్టీలనూ తాజా పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చాలని కాళీ శంకర్ తరఫు లాయర్‌ను కోర్టు ఆదేశించింది.
By December 11, 2020 at 06:56AM
No comments