యూకేలో మొదలైన కొత్త కొవిడ్ స్ట్రైయిన్ ఏమిటి? ఎందుకీ కలవరం? అంత ప్రమాదికారా?
బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ విజృంభించడంతో రోజువారీ కేసులు భారీగా నమోదువుతున్నాయి. ఈ స్ట్రెయిన్ ప్రస్తుత జన్యువు కంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు గుర్తించారు. దీంతో పలు దేశాలు బ్రిటన్ ప్రయాణాలపై తాత్కాలిక నిషేధం విధించాయి. ఈ స్ట్రైయిన్ ని VUI 202012/01 అని పిలుస్తారు. VUI అంటే వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇది ఒక కొత్త వేరియంట్ (వైవిధ్యం) మాత్రమే ఇది ఒక కొత్త వైరస్ కాదు. వైరస్ పరిణామంలో అనేక జన్యుమార్పిడిలు జరుగుతాయి. ఈ జన్యుమార్పిడులలో కొన్ని బాగా ప్రభావవంతమైనవి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఈ మార్పు బాగా ప్రభావితమైనది అని తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్లలో సుమారుగా 17 వరకు జన్యుమార్పిడిలు ఉన్నాయని గుర్తించారు. అందులో N501Y అన్నిటికన్నా ముఖ్యమైంది. అంటే 501 పొజిషన్‌లో ఆస్పర్జిన్ అనే అమినోయాసిడ్ స్థానంలో టైరోసీన్ అనే అమినోయాసిడ్ ఉంటుంది. ఈ మ్యుటేషన్ వల్ల వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది సుమారుగా 70 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ మ్యుటేషన్ స్పైక్ ప్రోటీన్‌లో ఉంది.. స్పైక్ ప్రోటీన్ రిసెప్టార్స్ బైండింగ్ ప్రోటీన్‌లో ఉంటుంది. దీంతో మానవ కణజాలంలోని ఏసీఈ 2 అనే రిసెప్టార్స్‌కి వైరస్ ఎక్కువగా అంటుకునే ప్రమాదం ఉంది. ఈ మ్యుటేషన్ తోపాటు 69/70 ప్రాంతంలో అమినోయాసిడ్ డిలీషన్స్ కూడా గుర్తించారు. వీటిని డెల్టా హెచ్ 69, డెల్టా వీ 70 అని పిలుస్తారు. ఈ మ్యుటేషన్ వల్ల వైరస్ వ్యాధినిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. P681H అనే మరొక మ్యుటేషన్ కూడా ఈ వైరస్ వైవిధ్యంలో కనబడింది. ఈ వేరియంట్‌ని తొలిసారిగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో కనుక్కున్నారు. అయితే ఇది ప్రస్తుతం డెన్మార్క్, స్పెయిన్‌లో కూడా కనబడడం విశేషం. దక్షిణాఫ్రికాలో మరొక వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతుందని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణాఫ్రికా వేరియంట్‌లో కూడా ఈ N501Y మ్యుటేషన్ ఉందని గుర్తించారు. ఈ వేరియంట్ వల్ల కరోనా వైరస్‌తో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆధారాలు బయటపడలేదు. అదేవిధంగా ఈ వేరియంట్ వల్ల వ్యాక్సిన్ పనికిరాకుండా పోయే అవకాశం ఉన్నట్లు కూడా ఎటువంటి ఆధారాల్లేవు. అయితే ఈ కొత్త స్ట్రెయిన్ విస్తృతంగా వ్యాప్తి చెందడంతో యూకే కలవర పడుతోంది. ఇప్పటికే యూకే కఠిన ఆంక్షలు విధించింది. క్రిస్మస్ వేడుకలను పరిమితంగా జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. విమానాలను కూడా రద్దు చేశారు. ఇప్పటికే యూకే నుంచి వచ్చే విమానాల్ని అనేక యూరోపియన్ దేశాలు రద్దు చేశాయి.
By December 22, 2020 at 10:47AM
No comments