గణతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్..
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గతనెల ఫోన్ చేసి ఆహ్వానించగా... జాన్సన్ అంగీకారం తెలిపినట్టు బ్రిటన్ ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు ఈ మేరకు మంగళవారం వెల్లడించాయి. భారత పర్యటనకు వస్తున్నట్టు మోదీకి లేఖ రాసిన ... వచ్చే ఏడాది బ్రిటన్‌లో జరిగే జీ7 సదస్సుకు హాజరుకావాలని భారత ప్రధానిని ఆహ్వానించినట్టు పేర్కొన్నాయి. భారత పర్యటన గురించి జాన్సన్ కూడా స్పందించారు. ‘ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న కొత్త ఏడాదిలో తొలుత భారత్‌లో పర్యటించబోతున్నాను.. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇతోధిక పురోగతి సాధించాలని మోదీ, నేనూ కృత నిశ్చయంతో ఉన్నాం. ఇందుకు నా పర్యటన దోహదపడుతుంది’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషించడమేకాదు.. బ్రిటన్‌కు అత్యంత ముఖ్యమైన భాగస్వామి కూడా. అభివృద్ధి సాధన, ఉద్యోగ కల్పన, భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కోవడం, ధరణిని కాపాడుకోవడం వంటి అంశాల్లో రెండు దేశాలూ కలిసి పనిచేస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన అనంతరం జాన్సన్ చేపడుతున్న తొలి కీలక పర్యటన ఇదే. పర్యటనలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి అంశాలపై ఇరువురి ప్రధానుల మద్య చర్చలు జరుపుతారని డౌనింగ్ స్ట్రీట్ పేర్కొంది. స్వాతంత్య్రం తర్వాత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న రెండో బ్రిటన్ ప్రధాని జాన్సన్ కావడం విశేషం. తొలిసారి 1993లో అప్పటి బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా విచ్చేశారు.
By December 16, 2020 at 07:43AM
No comments