Breaking News

అయ్యప్ప భక్తులకు అలర్ట్: నిబంధనలు సవరించిన కేరళ.. డిసెంబరు 26 నుంచి అమల్లోకి


శబరిమల అయ్యప్పస్వామి మండల-మకర విలక్కు సీజన్ వేళ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం మరోసారి నిబంధనలను సవరించింది. యాత్రికులతోపాటు శబరిమలలో విధులు నిర్వర్తించే అధికారులకు డిసెంబరు 26 నుంచి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది. మండల పూజలకు శబరిమల ఆలయాన్ని నవంబరు 16 నుంచి తెరిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 299 మంది కరోనా వైరస్ బారినపడ్డారని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. వీరిలో 51 మంది భక్తులు కాగా, 245 మంది దేవస్థానం సిబ్బంది, ఇతరులు ముగ్గురు ఉన్నారని అన్నారు. శబరిమల సీజన్ మొదలైన తర్వాత పత్తనంతిట్టా, కొట్టాయం జిల్లాలో వరుసగా 31%, 11% మేర కేసులు పెరిగాయని ఆమె తెలిపారు. శబరిమల సీజన్‌తోపాటు స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కోవిడ్-19 కేసులు పెరిగే అవకాశం ఉందని, ఆరోగ్య శాఖ నిబంధనలను ప్రతి ఒక్కళ్లూ పాటించాలని మంత్రి శైలజ సూచించారు. కోవిడ్-19 ప్రోటోకాల్‌కు అనుగుణంగా నడుచుకోవాలని, భౌతికదూరం పాటిస్తూ సూపర్ స్ప్రెడ్డింగ్‌‌కు అవకాశం ఇవ్వరాదు. భక్తులు తరుచూ చేతులును శుభ్రం చేసుకోవడం, తప్పనిసరిగా భౌతికదూరం, మాస్క్ ధరించడం నిబంధనలు పాటించాలి. తమ వెంట శానిటైజర్ తప్పక తెచ్చుకోవాలి. సవరించిన నిబంధనలు 1. కోవిడ్‌ బారినపడ్డవారు, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నవారు తీర్థయాత్రకు దూరంగా ఉండాలి. 2. డిసెంబరు 26 నుంచి శబరిమలకు వచ్చే భక్తులు, విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి. 3.శబరిమలకు చేరుకోడానికి 24 గంటల ముందు చేయించుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలి. ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబొరేటరీలో పరీక్ష చేయించుకోవాలి. 4. భక్తులు, సిబ్బంది ప్రతి 30 నిమిషాలకు ఒక్కసారి శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. 5.ఒక్కొక్కరి మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరి. 6.కరోనా నుంచి కోలుకున్నవారు యాత్రకు వస్తే తప్పనిసరిగా ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలి. 7.పంపా, నిలక్కల్‌లో పెద్ద సంఖ్యలో ఒకేసారి భక్తులను అనుమతించరు. టాయిలెట్స్‌ను ఉపయోగించిన తర్వాత శుభ్రపరచాలి.. తిరుగు ప్రయాణం కూడా సమూహాలుగా కుదరదు. 8.భక్తులతో పాటు డ్రైవర్లు, క్లీనర్లు, వంటమనిషిలు కూడా ఆరోగ్య శాఖ నిబంధనలు తూ.చ.తప్పకుండా పాటించాలి.


By December 16, 2020 at 07:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sabarimala-pilgrimage-kerala-govt-revises-guidelines-heres-what-you-need-to-know/articleshow/79750349.cms

No comments