Breaking News

నేడు ఈ ఏడాది చివరి సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం ఉంటుందా?


ఈ ఏడాదిలో చిట్ట చివరి సూర్యగ్రహణం సోమవారం ఏర్పడనుంది. ఇది కాగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.03 గంటల నుంచి అర్ధరాత్రి 12.23 గంటల దాకా కొనసాగనుంది. రాత్రి 9.43 గంటల సమయంలో గ్రహణం అత్యున్నత దశకు చేరుతుంది. ఈ గ్రహణం దక్షిణ అమెరికా, నైరుతి ఆఫ్రికా, అంటార్కిటికాలో కనిపించనుంది. ముఖ్యంగా చిలీ, అర్జెంటీనా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖగోళ ప్రియులకు ఓ రకంగా పండుగే. భారత్‌లో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు. గ్రహణం ప్రభావం భారత్‌లో లేనందున గ్రహణం సమయంలో, గ్రహణం ముగిశాక హిందూ ఆచారాల ప్రకారం చేసే క్రతువులు వర్తించవని పండితులు పేర్కొంటున్నారు. ఇక, ఈ ఏడాదిలో మొత్తం ఆరు గ్రహణాలు ఉండగా.. ఇప్పటికే ఐదు పూర్తయ్యాయి. వీటిలో నాలుగు చంద్ర గ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు. జూన్ 21న సూర్యగ్రహణం ఏర్పడింది. నెల రోజుల వ్యవధిలోనే మూడు గ్రహణాలు ఏర్పడటం విశేషం. రెండో చంద్రగ్రహణం జూన్ 5న ఏర్పడగా.. పదిహేను రోజుల తర్వాత జూన్ 21 సూర్యగ్రహణం... జులై 5 మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. నవంబర్ 30న చివరి చంద్ర గ్రహణం ఏర్పడగా.. నేడు ఏర్పడేది సూర్యగ్రహణం. కొన్నిసార్లు భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తాడు. ఆ సమయంలో సూర్య కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు. భూమిపై చంద్రుడి నీడ పడటంతో అక్కడివరకు సూర్యుడిని కప్పి ఉంచే ప్రక్రియను సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పి ఉంచినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం, చంద్రుడు పూర్తిగా కప్పి ఉంచితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య నాడు, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడతాయి. అయితే, అన్ని అమావాస్యలు, పౌర్ణమిలకు గ్రహణాలు ఏర్పడవు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమంలో పునరావృతం అవుతాయి. ఇక, ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం ఆచరించి, నదీ తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని అంటారు. ప్రస్తుతం ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం శాంటియోగో (చిలీ), సా పౌల్ (బ్రెజిల్), బ్యూనస్ ఎయిర్స్ (ఆర్జెంటీనా), లిమా (పేరూ), మోంటేవిడియో (ఉరుగ్వే), అసన్సియాన్ (పెరుగ్వే)లో స్పష్టంగా చూడవచ్చు.


By December 14, 2020 at 07:03AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/solar-eclipse-date-india-timings-and-importance-of-last-surya-grahan-of-2020/articleshow/79712948.cms

No comments