హనుమాన్ ఆలయానికి రూ.కోటి విలువైన భూమి విరాళంగా ఇచ్చిన ముస్లిం
దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దాదాపు కోటి రూపాయల విలువైన తన భూమిని హిందూ ఆలయానికి ఓ ముస్లిం వ్యక్తి దారాదత్తం చేశారు. బెంగళూరు రూరల్ జిల్లా హోస్కోట్ తాలూకా వలగేరేపురలోని హనుమాన్ ఆలయానికి అదే గ్రామానికి చెందిన హెచ్ఎంజీ భాషా తన భూమిని విరాళంగా ఇచ్చారు. ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేసే భాషాకు ఆలయం సమీపంలో కొంత భూమి ఉంది. వీరాంజనేయ ఆలయం రోడ్డు పక్కనే ఉండగా.. 75వ నెంబరు జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. విస్తరణ పనుల్లో భాగంగా ఆలయాన్ని పునఃనిర్మించనున్నారు. అయితే, ఆలయానికి సరిపడేంత భూమి లేకకపోవడంతో భాషాను సంప్రదించిన వీరాంజనేయ దేవాలయ సేవా సమితి.. కొంత స్థలం ఇవ్వాలని కోరింది. ‘హనుమాన్ ఆలయాన్ని తొలగించి, పునఃనిర్మిస్తామని ప్రభుత్వ అధికారులు సమాచారం ఇచ్చారు.. దీంతో హెచ్ఎంజీ భాషాను కలిసి, ఆలయం పక్కనే ఉన్న కొంత భూమిని ఇవ్వాలని కోరాం.. ఎందుకంటే ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ఆయన కూడా పాల్గొంటున్నారు’అని ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ ఎండీ బైరేగౌడ అన్నారు. మేము ఒక కుంట అడిగితే మొత్తం స్థలాన్ని ఆలయానికి ఇస్తున్నట్టు చెప్పడంతో ఆశ్చర్యపోయామని అన్నారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి స్థలం ఉండాలని, అందుకే మొత్తం భూమిని తీసుకోవాలని చెప్పారని పేర్కొన్నారు. ఆయన పెద్ద మనసుతో ముందుకురావడంతో కృతజ్ఞతలు చెబుతూ రోడ్లుపై ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. మందిరమైనా, మసీదైనా ఒకటేనని, సమాజం మంచి కోసం చేశానని సంతోషం వ్యక్తం చేశారు. ‘హిందూ-ముస్లింల మధ్య ఘర్షణల గురించి అనేక కథనాలు వస్తున్న సమయంలో ఆలయానికి స్థలాన్ని అప్పగిస్తూ బాషా తీసుకున్న నిర్ణయం స్వాగతించే అంశం.. ఈ ఆలయ పరిరక్షణకు కృషి చేసేవారికి సంతోషం కలిగించింది’ అని బైరెగౌడ వ్యాఖ్యానించారు.‘హిందూ, ముస్లింలు అన్నదమ్ములనే విషయాన్ని ఈ ఘటన గుర్తుచేస్తుంది’అని ఆయన చెప్పారు. కొత్త ఆలయానికి ఇప్పుడు పునాది వేశామని, కోటి వ్యయంతో నిర్మాణపనులు జనవరిలో ప్రారంభమవుతాయని అన్నారు.
By December 11, 2020 at 10:46AM
No comments