కరోనా కంటే ఎక్కువగా దాని గురించే.. 2020లో మనోళ్లు ఎక్కువగా వెతికిన అంశాలివే!
2020 ముగింపు దశకు వచ్చింది. మరి కొద్దిరోజుల్లో నూతన సంవత్సరాదిలో అడుగుపెట్టనున్నాం. ఈ నేపథ్యంలో 2020లో భారత్‌లో ట్రెండింగ్ అయిన టాపిక్‌లను గూగుల్ బయటపెట్టింది. ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా ఏ అంశాలను నెట్లో వెతికారనే విషయాన్ని సెర్చ్ ఇంజిన్ దిగ్గజమైన గూగుల్ వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అయిన టాప్-10 అంశాల్లో ఒకటిగా కరోనావైరస్ నిలిచింది. కాగా భారత్‌లో మాత్రం కరోనా కంటే ఎక్కువగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి వెతికారు. రెండ స్థానంలో కరోనా వైరస్, మూడో స్థానంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, నాలుగో స్థానంలో పీఎం కిసాన్ యోజనా, ఐదో స్థానంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిలిచాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బిడెన్ గురించి తెలుసుకోవడానికి భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపారు. అర్నబ్ గోస్వామి, కనికా కపూర్, కిమ్ జోంగ్ ఉన్, అమితాబ్ బచ్చన్ గురించి భారతీయులు ఆరా తీశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా దిల్ బెచారా కూటా టాప్ ట్రెండింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఎలా (హౌ) అనే విభాగానికి వస్తే.. పన్నీరు చేయడం ఎలా..? అనేది టాప్ ట్రెండ్‌గా నిలిచింది. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలా..? డల్గోనా కాఫీ పెట్టడం ఎలా..? తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేసుకోవడం ఎలా అనే అంశం నాలుగో స్థానంలో.. ఇంట్లోనే శానిటైజర్ చేసుకోవడం ఎలా అనే టాపిక్ ఐదో స్థానంలో నిలిచాయి. వాట్ (ఏమిటి).. అనే విభాగానికి వస్తే.. నోవల్ కరోనా వైరస్ అంటే ఏమిటి..? ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి..? హంటావైరస్ అంటే ఏమిటి..? బినోద్ మీమ్ గురించి.. సీఏఏ, ఎన్‌ఆర్సీ, నెపోటిజం, సూర్య గ్రహణం అంటే ఏమిటి..? అని భారతీయులు ఎక్కువగా ఆరా తీశారు. న్యూస్ ఈవెంట్స్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరోనావైరస్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, నిర్భయ కేసు, బీరూట్ పేలుళ్లు వరుసగా టాప్-5లో నిలిచాయి. లాక్‌డౌన్, ఇండియా-చైనా ఘర్షణలు, ఆస్ట్రేలియా కార్చిచ్చు, మిడతల దండు దాడి, రామ మందిరం అంశాలు తర్వాతి వరుసలో నిలిచాయి.
By December 11, 2020 at 10:51AM
No comments