ఎన్నికల ప్రచారంలో కమల్ బిజీ... ఊహించని షాక్ ఇచ్చిన సీనియర్ నేత
తమిళనాడు శాసనసభకు మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. మక్కల్ నీధి మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు ఊహించని షాక్ తగిలింది. మక్కల్ నీధి మయ్యం ప్రధాన కార్యదర్శి ఎ. అరుణాచలం పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎంఎన్ఎంలో సీనియర్ నేతగా ఉన్న అరుణాచలం.. పార్టీ వ్యవహరాల పట్ల అసంతృప్తితోనే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరినట్టు ప్రకటించారు. గ్రా మీణ ప్రాంతాల్లో కమల్ పార్టీని బలోపేతం చేయడానికి అరుణాచలం తీవ్రంగా కృషిచేశారు. ట్యూటికారిన్ జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన ఆయన కమల్ పార్టీ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించారు. మరోవైపు, వచ్చే ఎన్నికలకు ఇటీవల తన ప్రచారాన్ని మదురై నుంచి ప్రారంభించారు. ప్రజలను ఆకర్షించే విధంగా హామీలను గుప్పిస్తున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలను చేర్చారు. తన పార్టీ ప్రతిష్టాత్మక ఏడు పాయింట్ల పాలన, ఆర్థిక ఎజెండాను కమల్ ఇందులో పొందుపర్చారు. అందులో ప్రధానమైనది ఇళ్లల్లో పని చేసే మహిళలకు వేతనం ఇస్తామని ప్రకటించారు. కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని కమల్ హాసన్ హామీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికల్లో గెలవాలంటే మహిళల ఓట్లే కీలకమని భావించిన కమల్ హాసన్... వారిని ఆకర్షించేందుకు ఈ రకమైన హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ నిర్వహణ ఆర్థిక ఎజెండా పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏడు అంశాల్ని పొందుపరిచారు. తమిళ సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను రాజకీయాల్లో వచ్చినట్టు చెబుతోన్న కమల్ హాసన్.. తాను అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఏమేమి చేయనున్నారో తెలిపారు.
By December 25, 2020 at 12:47PM
No comments