ఫైజర్ టీకాతో అమెరికాలో ఆరోగ్య సిబ్బందికి అలర్జీ.. ఫైజర్ టీకాపై భద్రతపై సందేహాలు
అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మ సంస్థ తయారుచేసిన టీకాను బ్రిటన్, బహ్రెయిన్, అమెరికాలో అత్యవసర వినియోగం కింద పంపిణీ చేస్తున్నారు. అయితే, బ్రిటన్‌లో ఈ టీకా వేయించుకున్న ఇద్దరు నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన సిబ్బంది తీవ్ర అస్వస్థత గురైన విషయం తెలిసిందే. 24 గంటల వ్యవధిలో ఒళ్లంతా దురద, దద్దుర్లు, రక్త ప్రసరణలో తేడాలు వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. తాజాగా, అమెరికాలోనూ టీకా తీసుకున్న వ్యక్తులకు ఇటువంటి సమస్యలే ఎదురయ్యాయి. కరోనా టీకాను పొందిన ఇద్దరు ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి అలర్జీలు తలెత్తాయి. అలాస్కా రాష్ట్రంలోని బార్ట్‌లెట్ ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. గతంలో ఎన్నడూ అలర్జీ సమస్య తలెత్తని ఓ ఆరోగ్య కార్యకర్తకు టీకా ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఆ లక్షణాలు కనిపించాయి. ఆమె ఒంటిపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. కొన్నిసార్లు ఈ పరిస్థితి ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు. టీకా తీసుకున్న రెండో ఆరోగ్య కార్యకర్తకు కంటి కింద చర్మం ఉబ్బెత్తు కావడం, కళ్లు తిరగడం, గొంతులో అసౌకర్యం లాంటివి ఎదురయ్యాయి. కొన్ని ఔషధాలు ఇచ్చిన తర్వాత అతడు గంటలోపే కోలుకున్నట్టు పేర్కొన్నారు. టీకా షెడ్యూల్, డోసులపై తాజా పరిణామాల ప్రభావం ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. ఆక్సిజన్, అలర్జీ ఔషధాలు అందుబాటులో ఉన్న కేంద్రాల్లోనే టీకాలు ఇవ్వాలని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ (ఎఫ్‌డీఏ) ఇప్పటికే సిఫార్సు చేసింది. ఇక, గతంలో ఏవైనా ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారం కానీ తీసుకున్న సమయంలో అలర్జీ వచ్చినవాళ్లు కరోనా టీకాను తీసుకోవద్దని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారి మెడికల్ హిస్టరీని పరిశీలించాలని, అలర్జీలు ఏమైనా ఉంటే వారికి టీకాను వేయవద్దని ఆదేశించింది. ఏ వ్యక్తయినా గతంలో ఔషధాలు, ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అలర్జీ వంటి దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటే ప్రస్తుతం ఫైజర్ టీకాను తీసుకోవద్దని బ్రిటన్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైనీ అన్నారు. ‘టీకా వేయించుకున్న చాలా మందికి అలర్జీ రాదు.. కోవిడ్-19 నుంచి ప్రజలను రక్షించి ప్రమాదాలను అధిగమించవచ్చు.... ఈ టీకా భద్రత, నాణ్యత, ప్రభావం ఎంహెచ్ఆర్ఏ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పూర్తిగా నమ్మవచ్చు’ పేర్కొన్నారు.
By December 18, 2020 at 09:07AM
No comments