Breaking News

90 సినిమాలకు కథా రచయిత, చిరంజీవి కెరీర్‌లో కీలక పాత్ర.. డీఎస్పీ తండ్రి సత్యమూర్తి వర్థంతి నేడు


సంగీత దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న వయసులోనే ‘దేవీ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తెలుగు, తమిళ భాషల్లో కొన్ని వందల సినిమాలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. అభిమానులతో ‘రాక్‌స్టార్’ అంటూ ముద్దుగా పిలుచుకునే ఆయన దేవీశ్రీ ప్రసాద్‌కు ఆయన తండ్రి అంటే చాలా ఇష్టం. ఒకరకంగా దేవీ సినిమాల్లోకి రావడానికి కారణం ఆయనే. రెండు దశాబ్దాల పాటు తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలకు కథలు అందించారాయన. డిసెంబర్ 14న ఆయన వర్థంతి కావడంతో సత్యమూర్తి గురించి ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో 1953 మే 24న గొర్తి సత్యమూర్తి జన్మించారు. రామచంద్రపురంలో బీఎస్సీ పూర్తి చేసిన ఆయనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. దీంతో ‘చైతన్యం’ అనే నవలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ‘పవిత్రులు’, ‘పునరంకితం’, ‘ఎదలోయలో నిదురించే’, ‘దిగంబర అంబరం’, ‘అధర గరళం’ వంటి ఎన్నో రచనలతో పాఠకులను ఆకట్టుకున్నారు. మొదట గేయ రచయిత కావాలనుకున్న ఆయన ‘దేవత’ సినిమాతో కథారచయితగా పరిచయమయ్యారు. డి.రామానాయుడు నిర్మాతగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో సత్యమూర్తి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత బావా మరదళ్లు, కిరాయి కోటిగాడు, ‘ఖైదీ నంబర్‌ 786’, ‘అభిలాష’, ‘పోలీస్‌ లాకప్‌’, ‘ఛాలెంజ్‌’ వంటి విజయవంవతమైన చిత్రాలకి ఆయన కథలు అందించారు. 1980, 90 దశకాల్లో వచ్చిన ‘బంగారు బుల్లోడు’, ‘భలే దొంగ’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అమ్మ దొంగా’, ‘చంటి’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘పెదరాయుడు’, ‘మాతృదేవోభవ’, రౌడీ అన్నయ్య, అమ్మదొంగా.. వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల వెనక సత్యమూర్తి ఉన్నారు. ‘దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘చైతన్య’ సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. సుమారు 90కిపైగా సినిమాలకి కథా రచయితగా, 400కి పైగా సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లో సత్యమూర్తి కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన అభిలాష, ఖైదీ నెం 786, ఛాలెంజ్, జ్వాల చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. చెన్నైలోని సాలి గ్రామంలో స్థిరపడిన ఆయన తన 62వ ఏట.. 2015, డిసెంబరు 14న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆయన వర్ధంతి. జి.సత్యమూర్తికి ఇద్దరు కుమారులు దేవీశ్రీ ప్రసాద్, సాగర్‌తో పాటు ఓ కుమార్తె ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడిగా కొనసాగుతుండగా, సాగర్‌ సింగర్‌గా రాణిస్తున్నారు.


By December 14, 2020 at 07:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/devi-sri-prasad-father-famous-telugu-writer-satyamurthy-death-anniversary/articleshow/79709333.cms

No comments