Breaking News

దేశంలో కొత్తకరోనా కలవరం.. బ్రిటన్ నుంచి వచ్చి 25 మందికి పాజిటివ్


ఒకానొక దశలో రోజుకు దాదాపు లక్ష వరకు నమోదయిన కోవిడ్ కేసులు క్రమంగా మూడు నెలల నుంచి తగ్గుముఖం పట్టి కాస్త కుదుటపడుతున్న భారత్‌ను కొత్తరకం కరోనా భయపెడుతోంది. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం స్ట్రెయిన్‌తో ప్రపంచ మరింత కలవరం పడుతోంది. తాజాగా, బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన 25 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 25 మందికి కొత్త స్ట్రెయిన్ సోకిందా? లేదా పాతదేనా అనేది నిర్ధరించడానికి వారి నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి పంపారు. సెప్టెంబరు నుంచే బ్రిటన్‌లో కొత్త రకం వైరస్‌ వ్యాప్తి ప్రారంభం కావడంతో ఇప్పటికే యూకే నుంచి వచ్చినవారి ద్వారా మన దేశంలోకి కొత్త వైరస్‌ ప్రవేశించి ఉండొచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లండన్‌ నుంచి సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. వాస్తవానికి వారిలో ఐదుగురికి ఢిల్లీ పాజిటివ్‌గా తేలగా.. మరో వ్యక్తి అక్కడ నుంచి చెన్నైకి చేరుకున్నాక కరోనా బారిన పడినట్లు తేలింది. వీరి నమూనాలను జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రానికి (ఎన్‌సీడీసీ) పంపించారు. లండన్‌ నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్న ప్రయాణికుల్లో ఇద్దరు కరోనా బారినపడ్డారు. లండన్‌ నుంచి మంగళవారం అహ్మదాబాద్‌కు వచ్చినవారిలో ఐదుగురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. వారిలో ఒకరు బ్రిటన్‌ పౌరుడు కావడం గమనార్హం. మరోవైపు, బ్రిటన్‌ నుంచి మూడు విమానాల్లో 590 మంది ప్రయాణికులు మంగళవారం ముంబయికి చేరుకున్నారు. వారిలో 187 మంది ముంబయివాసులు, 167 మంది మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు చెందినవారని, మిగతావారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు. వీరిలో ఎవరికీ వైరస్ నిర్ధారణ కాకపోవడంతో ఊరటనిచ్చే అంశం. బ్రిటన్‌ నుంచి 250 మంది ప్రయాణికులు, 22 మంది సిబ్బందితో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమృత్‌సర్‌కు చేరుకున్న ఎయిరిండియా విమానంలో 8 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. వారిలో విమానయాన సిబ్బంది కూడా ఒకరు ఉన్నారు. లండన్‌ నుంచి బెంగళూరుకు డిసెంబరు 19న విమానంలో వచ్చిన 38 మంది ప్రయాణికులకు తాజాగా పరీక్షలు నిర్వహించగా తల్లీకూతుళ్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తల్లి వయసు 35 ఏళ్లు, పాపకు ఆరేళ్లని వారి రక్త నమూనాలను ఎన్‌ఐవీకి పంపించినట్లు అధికారులు తెలిపారు.


By December 23, 2020 at 08:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/twenty-five-passengers-tested-covid-19-positive-in-india-who-arrived-from-london/articleshow/79908289.cms

No comments