Breaking News

ఆర్మీ రిక్వెస్ట్.. 17 నిమిషాల ముందే స్టేషన్‌కు రాజధాని రైలు.. కారణం ఇదే


‘ఆర్మీ రిక్వెస్ట్‌తో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను అత్యంత వేగంగా నడిపి నిర్దేశిత సమయాని కంటే 17 నిమిషాలు ముందే బార్కకనా స్టేషన్‌ (రాంచీ డివిజన్) కు చేరుకుంది.. తద్వారా 100 మంది ఆర్మీ జవాన్లు ఎక్కడానికి అదనపు సమయం లభించింది’ అని రైల్వే మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ‘మేము మా సైనికుల అవసరాలను అర్థం చేసుకున్నాం.. వాటిని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం’ అని వ్యాఖ్యానించింది. మొత్తం 100 మంది సైనికులు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో రామగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే, రామ్‌గఢ్ నుంచి రాంచీకి వెళ్లి ఈ రైలును అందుకోవాల్సి ఉంది. కానీ, సాంకేతిక కారణాల వల్ల అక్కడకు వెళ్లాలంటే దూరం ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో వారికి సమీపంలో ఉన్న బార్కకనా స్టేషన్‌లో రైలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం గురించి రైల్వే అధికారులకు ఆర్మీ సమాచారం ఇచ్చింది. అయితే, 100 మంది జవాన్లు లగేజీలతో సహా ఎక్కాలంటే ఐదు నిమిషాల్లో కష్టమని, దీనికి అదనపు సమయం కావాలి. రాంచీ డివిజన్‌లో ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు నిలపడం అసాధ్యం. కానీ, దేశ రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్న సైనికులు దేశానికి గర్వకారణం కావడంతో అధికారులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాంచీ నుంచి బార్కకనాకు నిర్దేశిత సమయం కంటే ముందే రైలు చేరుకునేలా రాజధాని గరిష్ఠ వేగంతో నడపాలని నిర్ణయించారు. రాజధాని రైలుకు అదనపు సమయం 10 నిమిషాలు, దీనిని రైల్వే భాషలో స్వల్ప సమయం అంటారు. రాజధాని రైలు గరిష్ఠ వేగాన్ని ఉపయోగించి ఆదివారం రాత్రి 7.08 గంటలకు బార్కకనా స్టేషన్‌కు చేరుకుంది. వాస్తవానికి బార్కకనా షెడ్యూల్ సమయం రాత్రి 7.25 గంటలు. రాంచీ నుంచి ఇది ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరింది. రైలు 17 నిమిషాలు ముందే చేరుకోవడం సహా దీని హాల్టింగ్ సమయం మరో 5 నిమిషాల కలిపి మొత్తం 22 నిమిషాలు ఆ స్టేషన్‌లో రైలు నిలిపి, 100 మంది సైనికులు ఎక్కేందుకు రైల్వే అధికారులు సహకరించారు. ‘రాంచీ, బార్కకనా రైల్వే కంట్రోల్ రెండూ రాజధాని రైలును గరిష్ఠ వేగంతో సమన్వయం చేశాయి.. ఈ కారణంగా 17 నిమిషాల ముందే రైలు బర్కాకానాకు చేరుకుంది. రాజధాని రైలును కొనసాగిస్తూ సైన్యానికి సహాయం చేయడం మన కర్తవ్యం.. రైలును సకాలంలో చేర్చినందుకు ఆపరేటింగ్ బృందానికి అభినందనలు’ అంటూ రాంచీ డీఆర్ఎం నీరజ్ అంబస్థా వ్యాఖ్యానించారు.


By December 23, 2020 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajdhani-express-runs-at-max-speed-at-armys-request-reaches-station-17-mins-early/articleshow/79907093.cms

No comments