Breaking News

పిస్టల్, 16 బుల్లెట్లతో విమానం ఎక్కబోయిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే.. అడ్డుకున్న సిబ్బంది


తుపాకి, బుల్లెట్లతో విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మాజీ ఎమ్మెల్యే విమానాశ్రయంలో అధికారులకు చిక్కాడు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే (60) ప్రస్తుతం హట్టి బంగారు గనుల కార్పొరేషన్‌ అధ్యక్షుడుగా ఉన్నారు. ఎయిరిండియా విమానంలో హైదరాబాద్‌ వచ్చేందుకు విమానాశ్రయానికి చేరుకున్న మానప్ప వజ్జల్‌ వద్ద 16 బుల్లెట్లు ఉన్నట్టు తనిఖీలో గుర్తించారు. ప్రయాణికుల చెక్‌ ఇన్ పాయింట్ వద్ద ఆయన బ్యాగులో నిషేధిత వస్తువు ఉన్నట్టు స్కానర్ ద్వారా సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు ఆయనను ఆపేసి, బ్యాగును తెరిచారు. ఇందులో 16 బుల్లెట్లు సహా 32ఎంఎం పిస్టల్ గుర్తించారు. మానప్పను అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. తనకు లైసెన్స్ తుపాకీ ఉందని, పొరపాటున దానిని తీసుకొచ్చానని విచారణలో మానప్ప వెల్లడించారు. దీనికి సంబంధించిన పత్రాలను చూపడంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు మానప్ప వజ్జల్‌ను హెచ్చరించి, విమాన ప్రయాణానికి అనుమతించారు. దీనికి ముందు రోజే ఇటువంటి ఘటన బెంగళూరు విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ధార్వాడ్‌కు చెందిన ఫైజల్ కాజీ అనే వ్యక్తి వద్ద .32 ఎంఎం పిస్టల్, ఓ బుల్లెట్ లభ్యమయ్యాయి. బెంగళూరు నుంచి మంగళూరుకు ఇండిగో విమానం ఎక్కేందుకు వచ్చిన అతడి వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నారు.


By December 21, 2020 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-bjp-mla-held-with-16-live-bullets-at-bengaluru-international-airport/articleshow/79833128.cms

No comments