Breaking News

వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసన.. పంజాబ్‌లో 1,500 జియో టవర్లు ధ్వంసం


కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్‌లో జియో టవర్లను ధ్వంసం చేస్తున్నారు. అక్కడ మొత్తం 9,000 జియో టవర్లుండగా.. 1,500కిపైగా ధ్వంసమయ్యాయి. జియో సంస్థ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. పలు టవర్లను ధ్వంసం చేశారని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేదా జనరేటర్ల ఎత్తుకెళ్లడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలపై పంజాబ్ సీఎం కెప్టెన్ తీవ్రంగా స్పందించారు. రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులు టెలికం టవర్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. టవర్లు విధ్వంసానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ప్రజా, ప్రయివేట్ ఆస్తులను విధ్వంసాన్ని ప్రభుత్వం అనుమతించదని, శాంతియుత నిరసనలకు తమ ప్రభుత్వం అభ్యంతర చెప్పదన్నారు. గతవారం రోజుల నుంచి చాలా చోట్ల జియో టవర్లకు విద్యుత్తు పంపే లైన్లను ధ్వంసం చేయడం.. టవర్లను కూల్చేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తున్నారు. వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉద్యోగులపై రైతులు దాడులు చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల టెలికం సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలకు లబ్ది కలుగుతుందని భావిస్తున్న రైతులు జియో టవర్లను టార్గెట్ చేసుకున్నారు. ‘కొవిడ్‌ విస్తరించిన సమయంలో టెలికం సేవలు బాధితులకు, ప్రజలకు అత్యంత కీలకమైనవి. ఈ నేపథ్యంలో రైతులు క్రమశిక్షణతో వ్యవహరించాలి.. విద్యార్థులు ముఖ్యంగా బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు.. ఇంటి నుంచి పనిచేసుకునే ఉద్యోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.. బ్యాంకింగ్ సేవలు కూడా ఆన్‌లైన్‌పై ఆధారపడి ఉన్నాయి’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాదు దాడులు, విధ్వంసం వంటివి రైతుల సంక్షేమానికి ఏ మాత్రం సహకరించవని పేర్కొన్నారు. ఈ అంశం గురించి ది టవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రస్ట్రక్చర్‌ ప్రొవైడర్‌స్‌ అసోసియేషన్‌.. పంజాబ్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. జలంధర్‌లో జియో ఫైబర్ కేబుల్స్‌ను పెద్ద సంఖ్యలో ధ్వంసం చేసి, నిప్పంటించారు. అంతేకాదు, ఆ సంస్థ ఉద్యోగులకు బెదిరించి అక్కడ నుంచి వెళ్లగొట్టారు. ఇప్పటి వరకు పంజాబ్ పోలీసులు ఈ ఘటనలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.


By December 29, 2020 at 07:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-1500-mobile-towers-damaged-in-punjab-amid-farmers-anger-against-jio/articleshow/80001996.cms

No comments