Breaking News

దేశంలో కొత్తరకం కరోనా తొలి కేసు.. యూకే నుంచి వచ్చిన తెలంగాణ వ్యక్తిలో గుర్తింపు!


యూకేలో విజృంభిస్తోన్న కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌తో ప్రపంచ దేశాలు మరోసారి భయం గుప్పిట్లోకి జారుకున్నాయి. మహమ్మారి కొత్తరూపాన్ని సంతరించుకోవడంతో టీకా అందుబాటులోకి వస్తుందనే ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. ఇదిలా ఉండగా కేసు తెలంగాణలో నమోదయినట్టు సమాచారం. యూకే నుంచి డిసెంబరు 10 న రాష్ట్రానికి వచ్చిన ఓ వ్యక్తి (49)లో కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్ ఉన్నట్లు తాజాగా సీసీఎంబీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ, ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. అలాగే, దేశంలోకి యూకే వైరస్‌ ప్రవేశంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. వివిధ రాష్ట్రాల్లో ఈ తరహా పరీక్షలు నిర్వహిస్తుండటంతో వాటన్నింటి ఫలితాలను సమీకరించి ఒకేసారి కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వరంగల్‌ జిల్లాకు చెందిన వ్యక్తికి కొత్తరకం కోవిడ్‌ సోకినట్లు తెలుస్తోంది. ‘యూకే నుంచి వచ్చిన ఆ వ్యక్తిలో డిసెంబరు 16న కోవిడ్‌ లక్షణాలు కనిపించాయి.. స్థానికంగానే నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.. అప్పటి నుంచి వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి నమూనాలను రెండు రోజుల కిందట సేకరించి సీసీఎంబీకి పంపించారు. కరోనా జీనోమ్ సీక్వెన్స్ విశ్లేషణ పరీక్షల్లో వైరస్‌‌లో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నట్లుగా గుర్తించారు. యూకేలో విజృంభిస్తోన్న వైరస్.. ఇదీ ఒక్కటేనని నిర్ధారించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపారు. అతడి కుటుంబసభ్యులు, సన్నిహితులకు యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహించగా.. బాధితుడి తల్లి (71)కి పాజిటివ్‌గా వచ్చింది. భార్య సహా ఇతరులకూ నెగెటివ్‌‌గా తేలింది. ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందజేస్తున్నారు.. ఆమె రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం సీసీఎంబీకి పంపారు. యూకే వైరస్‌ సోకిన వ్యక్తి, ఆయన తల్లిలో ఎటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలూ లేవు.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.. మరో 7-10 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచుతాం. ఇంకో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేయించి, యూకే వైరస్‌ నెగెటివ్‌గా వచ్చిన తర్వాతే ఇంటికి పంపుతాం’ అని వైద్యశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.


By December 29, 2020 at 06:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-new-strain-found-in-telangana-man-who-came-from-uk-on-december-10th/articleshow/80001843.cms

No comments