GHMC ఎన్నికల్లోనూ ‘దుబ్బాక’ రిపీట్.. కాంగ్రెస్ కీలక నేత నుంచి ఊహించని ట్వీట్
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ సహా యావత్ దేశాన్ని ఆకర్షించింది. ఈ బై పోల్‌లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం కనిపిస్తోంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్మరణంతో.. ఆయన భార్యకే గులాబీ పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ.. సానుభూతి పని చేయలేదు. హరీశ్ రావు ఎంతగా ప్రయత్నించినా సరే.. అధికార పార్టీకి విజయం దక్కలేదు. తెలంగాణ రాజకీయల్లో బీజేపీ బలపడుతోందని చెప్పడానికి దుబ్బాక ఫలితం ఓ సంకేతమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. దుబ్బాకలో గెలిచిన ఊపులో ఉన్న బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆరాటపడుతోంది. మజ్లిస్, టీఆర్ఎస్ ఒకటేనని.. టీఆర్ఎస్‌కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్టేనని కమలనాథులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్, టీడీపీ కూడా పోటీలో ఉన్నప్పటికీ.. గ్రేటర్‌లో పోరు ప్రధానంగా టీఆర్ఎస్-మజ్లిస్, బీజేపీ మధ్యే ఉండే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజ్ శ్రవణ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘‘దుబ్బాకలో ఓటర్ల దెబ్బకి కేసీఆర్ అండ్ కో.. మైండ్ బ్లాంక్ అయ్యింది, ఇప్పుడు జీహెచ్‌ఎంసీ లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలి’’ అని శ్రవణ్ ట్వీట్ చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ను ఓడించినట్లుగానే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఓడించాలనేది ఆయన ఉద్దేశం. కానీ అది పార్టీ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపేలా ఉంది. దుబ్బాకలో పోరాడి గెలిచింది బీజేపీ. అధికార పార్టీతో కొట్లాడి నెగ్గింది కమలం పార్టీ. అక్కడ కారు బ్రేక్ డౌన్ అయిన మాట వాస్తవమే. కానీ హస్తం ఒకే ఒక్క రౌండ్‌లో ఆధిపత్యం చెలాయించిందని.. అతి కష్టం మీద 22 వేల ఓట్లు దక్కించుకుందనే విషయాన్ని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి శ్రవణ్ మర్చిపోయారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి అంతర్మథనం చేసుకోకుండా.. టీఆర్ఎస్ ఓడితే చాలు అన్నట్లుగా ట్వీట్ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. కానీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే నాయకుడు కరువయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా.. మళ్లీ కారెక్కడం ఖాయం అనే భావన జనాల్లో ఉంది. అందుకే దుబ్బాక ఓటరు బీజేపీ వైపు మొగ్గు చూపాడు. పార్టీ అంపశయ్య మీద ఉందనే విషయాన్ని వదిలేసి టీఆర్ఎస్ ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటామంటారా..? అయితే కానీయండి.
By November 17, 2020 at 09:26AM
No comments