అదిరిపోయే స్కీం ప్రారంభించిన మమతా బెనర్జీ.. యువతకు బైక్స్
వచ్చే ఏడాది మేలో పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. సీఎం వ్యూహాత్మకంగా పథకాలను ప్రవేశపెడుతున్నారు. బీజేపీ రూపంలో ముప్పు పొంచి ఉండటంతో యువతను ఆకర్షించేందుకు మమతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరో వినూత్న పథకానికి మమత శ్రీకారం చుట్టారు. యువతలో ఆత్మస్థయిర్యం నింపేందుకు ‘కర్మ్ సాథీ స్కీం’ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని రెండు లక్షల మంది యువతకు మోటార్ సైకిళ్లను అందజేయనున్నారు. అలాగే యువత వ్యవసాయంవైపు మొగ్గుచూపేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం మమతా తెలిపారు. 2 లక్షల మంది యువతకు మోటారు సైకిళ్లను పంపిణీ చేసి, వీటి వెనుక భాగంలో ప్రత్యేకమైన బాక్సులను అమర్చనున్నారు. ఈ బాక్సుల్లో పండ్లు, కూరగాయలు, దుస్తులు లేదా ఇతర వస్తువులను ఉంచి లబ్ధిదారులు విక్రయాలు సాగించవచ్చు. తద్వారా యువత తాము పండించిన పంటను పట్టణాలలో అమ్ముకోవచ్చు. అలాగే పట్టణాలలో లభ్యమయ్యే వస్తువులను గ్రామాలకు తీసుకువచ్చి విక్రయించవచ్చు. ఈ విధానం వల్ల యువతకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం యువతకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రూ.2 లక్షల వరకు రుణ సదుపాయాన్ని కూడా కల్పించనుంది. ఉత్పత్తి, సేవలు, వ్యాపారం రంగాల్లో ఆదాయం వచ్చే ఏ కొత్త ప్రాజెక్టైనా రుణ సౌకర్యం కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సహకార బ్యాంకుల్లో సులువుగా రుణాలను అందజేయనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో 18-35 ఏళ్ల మధ్య యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 20.1 లక్షల మంది యువత ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్‌లో నిరుద్యోగ శాతం ఆగస్టు నాటికి 40 శాతం తగ్గినట్టు మమతా బెనర్జీ ఇటీవల వెల్లడించారు. సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకనమీ (సీఎంఐఈ) నివేదిక ప్రకారం బెంగాల్‌లో నిరుద్యోగం 6.5 శాతం కాగా.. జాతీయ సగటు కంటే (11 శాతం) చాలా తక్కువ. ఉత్తర్ ప్రదేశ్ 9.6, హరియాణాలో 33.6 శాతంగా ఉంది.
By November 15, 2020 at 11:19AM
No comments