పేదలకు మోదీ సర్కారు మరో శుభవార్త.. ఆ పథకం మార్చి వరకు పొడిగింపు!
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేసే పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మార్చి వరకు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సరిపడేంత బియ్యం, గోధుమలు, పప్పు నిల్వలు ఉండడంతో ఈ పథకాన్ని పొడిగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకం కింద గత ఎనిమిది నెలల నుంచి ప్రతి నెలా 5 కిలోల బియ్యం/ గోధుమలు, ఒక కిలో పప్పులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. నెలవారీ కోటాకు ఇవి అదనంగా ఇస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. గడచిన ఎనిమిది నెలలుగా ఈ పథకానికి లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. వాస్తవానికి లాక్‌డౌన్ కాలంలో తొలుత మూడు నెలలు పాటు ఈ పథకం అమలు చేయాలని భావించారు. అయితే, పలు పండగలు నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నవంబర్ నెల చివరి వరకూ ఉచిత రేషన్ పంపిణీ కొనసాగించాలని నిర్ణయించారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తున్నారు. దీపావళి పండగ వరకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేయడానికి రూ. 90 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి మూడు నెలలు రూ. 60 వేల కోట్ల ఖర్చు కాగా.. మొత్తం దీపావళి వరకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చయ్యింది. గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించే చర్యల కోసం రూ.50 వేల కోట్లు కేటాయించారు. పండగలతో అవసరాలు, ఖర్చులు పెరుగుతాయని భావించిన కేంద్రం.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలనే ఈ నిర్ణయం తీసుకుంది.
By November 28, 2020 at 06:51AM
No comments