Breaking News

ఒక్క అడుగు దూరంలో కరోనా‌కు టీకా.. అత్యవసర వినియోగం కింద ఎఫ్‌డీఏకి ఫైజర్ దరఖాస్తు


తాము తయారుచేసిన టీకాను అత్యవసర వినియోగం కింద అనుమతి కోరుతూ అమెరికా రెగ్యులేటరీకి ఫైజర్ సంస్థ దరఖాస్తు చేసింది. తొలిసారిగా కోవిడ్-19కు వ్యతిరేకంగా టీకా పంపిణీకి రెగ్యులేటరీ అనుమతి కోరడం కీలక ముందడుగు. జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తాము అభివృద్ధి చేసిన టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో వెల్లడయ్యిందని ఫైజర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వారం రోజుల్లోనే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయడం విశేషం. అత్యవసర వినియోగం కింద దరఖాస్తు చేసిన విషయాన్ని ఫైజర్ సీఈఓ అల్బర్ట్ బౌర్లా ధ్రువీకరించారు. దీని గురించి ఆ సంస్థ వెబ్‌సైట్‌లో శుక్రవారం మధ్యాహ్నం వీడియోను పోస్ట్ చేశారు. ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసిన విషయం వెల్లడయిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం ఫైజర్, బయోఎన్‌టెక్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. ఫైజర్ 1.3 శాతం, బయోఎన్‌టెక్ 9.3 శాతం మేర లాభపడ్డాయి. అత్యవసర వినియోగానికి ఫైజర్ చేసిన దరఖాస్తులో క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న 12-15ఏళ్లలోపు చిన్నారుల 100 మంది డేటా కూడా ఉంది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నవారిలో 45 శాతం మంది 56-85ఏళ్ల వయసువారేనని తెలిపింది. ఫైజర్ దరఖాస్తుపై అమెరికా ఆరోగ్య సేవల మంత్రి అలెక్స్ అజర్ స్పందిస్తూ.. ఒకవేళ టీకా 95 శాతం ప్రభావవంతం చూపుతుందని పేర్కొన్న డేటా సరైందే అయితే కొద్ది వారాల్లోనే అనుమతి ఇస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. డిసెంబరు మధ్య నాటికి ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభిస్తుందని, ఆ వెంటనే డోస్‌ల సరఫరా చేపట్టాలని ఫైజర్ భావిస్తోంది. ఈ ఏడాది చివరికి 50 మిలియన్ డోస్‌లను సిద్దం చేయనున్నామని తెలిపింది. ఎఫ్‌డీఏ సలహాదారుల కమిటీ డిసెంబరు 8-10 మధ్య సమావేశమై వ్యాక్సిన్ గురించి చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తుది దశ ఫలితాల సమాచారం ప్రకారం అన్ని వయసులవారిపై ప్రభావం చూపుతోంది. టీకా క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న 43,000 మందిలో 170 మంది కరోనా వైరస్ సోకగా..162 మందికి ప్లాసిబో ఇచ్చారు. అంటే ఇది 95 శాతం ప్రభావం చూపిందని భావిస్తున్నారు. టీకా మూడో దశ ప్రయోగాల్లో 42 శాతం మంది వివిధ దేశాలకు చెందిన వాలంటరీర్లు, 30 శాతం మంది అమెరికాలో స్థానికులు పాల్గొన్నారని ఫైజర్ తెలిపింది.


By November 21, 2020 at 06:48AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-pfizer-inc-files-covid-19-vaccine-application-to-us-fda/articleshow/79333142.cms

No comments