Breaking News

సంస్కృతంలో ప్రమాణం చేసిన న్యూజిలాండ్ ఎంపీ.. భారతీయ భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు


ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మరోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున భారత సంతతి యువ వైద్యుడు గౌరవ్ శర్మ విజయం సాధించారు. ఎంపీగా ఎన్నిక కావడంతో పార్లమెంట్‌ సభ్యుడిగా ఆయన సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేసిన రెండో భారత సంతతి వ్యక్తిగా గౌరవ్ నిలిచారు. ఈ ఏడాది జులైలో సురినామ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయిన భారత సంతతికి చెందిన చంద్రికాప్రసాద్ సంతోఖి సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన గౌరవ్.. హమిల్టన్ వెస్ట్ నుంచి ఎన్నికయ్యారు. బుధవారం న్యూజిలాండ్ పార్లమెంట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తొలుత స్థానిక భాష మౌరిలోనూ, ఆపై సంస్కృతంలో గౌరవ్ ప్రమాణం చేశారని న్యూజిలాండ్‌లో భారత దౌత్యాధికారి ముక్తేశ్ పర్దేశి వెల్లడించారు. రెండు దేశాల సంస్కృతులను గౌరవించేలా గౌరవ్ నడచుకున్నారని ఆయన ప్రశంసించారు. ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన గౌరవ్ శర్మ.. వాషింగ్టన్‌లో ఎంబీఏ చదివారు. ప్రమాణ స్వీకారం తరువాత ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ హిందీలో ఎందుకు ప్రమాణం చేయలేదని అడిగితే.. హిందీ కంటే సంస్కృతంలో ప్రమాణం చేస్తే, అన్ని భారతీయ భాషలకూ గౌరవం దక్కుతుందని తాను భావించానని బదులిచ్చారు. హిందీలో మాట్లాడటం గురించి తాను ఆలోచించలేదన్నారు. భారత్‌లో మాట్లాడే ప్రస్తుత భాషల విస్తృత శ్రేణిని సూచించే భాషను ఎంచుకోవాలనే ఉద్దేశంతో సంస్కృతంలో ప్రమాణం చేశానన్నారు. అంతేకాదు, 3500 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన సంస్కృతం.. చాలా భారతీయ భాషలకు అమ్మ లాంటిదని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక విద్యాభ్యాసం సమయంలోనే ఈ భాషను నేర్చుకున్నానని శర్మ వివరించారు. న్యూజిలాండ్ ప్రభుత్వంలో మరో భారత సంతతి నేత ప్రియాంక రాధాకృష్ణన్ ఇటీవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి విదితమే. ఆమె తన మాతృభాష మళయాలంలోనే ప్రమాణస్వీకారం చేశారు.


By November 26, 2020 at 10:53AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/india-origin-new-zealand-mp-gaurav-sharma-takes-oath-in-sanskrit/articleshow/79421911.cms

No comments