ఆ ప్రతిపాదన ‘పిడుగుపాటు’లాంటిది.. ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యలకు చిదంబరం మద్దతు
కార్పొరేట్ సంస్థలు బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనలపై ఆర్ధికవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సైతం ప్రతిపాదనను తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను తమ నియంత్రణలోకి తీసుకోవడం కోసం కొందరు ఆడుతున్న నాటకంమని, ఇది దేశానికి చాలా ప్రమాదకరమని ఆయన విమర్శించారు. ఇది ఆర్బీఐని కూడా బలహీనపరుస్తుందని చిదంబరం హెచ్చరించారు. ఈ ప్రతిపాదనలు అమలైతే జాతి ఆర్థిక వనరులన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఇటీవల ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. రఘురామ్ వ్యాఖ్యలను సమర్థించిన చిదంబరం‘ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో మొత్తం రూ. 140 లక్షల కోట్లకు పైగానే డిపాజిట్లు ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలకు బ్యాంకులను ప్రారంభించేందుకు అనుమతిస్తే, అవి చాలా చిన్న చిన్న పెట్టుబడులతోనే దేశ ఆర్థిక వనరులను తమ గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తాయి’అని ట్విట్టర్‌లో చిదంబరం ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఈ ప్రతిపాదన పూర్తిగా తిరోగమనానికి ఆర్థిక, రాజకీయ శక్తుల జోక్యానికి ఎలా దారితీస్తుందో స్పష్టమైన, నమ్మదగిన కారణాలను డాక్టర్ రాజన్, డాక్టర్ ఆచార్య తెలియజేశారు.. నిపుణులు వ్యతిరేకించిన అటువంటి ఆలోచనను ఆర్బీఐ ఆమోదం ఉన్నట్లు ప్రజలకు అందించడం ఆశ్చర్యకరమైనది’ అని దుయ్యబట్టారు. ఈ ప్రతిపాదననలు అమలులోకి వస్తే, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న కార్పొరేట్ సంస్థలకు తొలి లైసెన్స్‌లు లభిస్తాయన్నది బహిరంగ రహస్యమేనని ఆయన అన్నారు. దేశంలోని కార్పొరేట్ సంస్థల సముపార్జన ఆశయాలకు మోదీ ప్రభుత్వం సహకరిస్తుందనడానికి ఇది మరొక ఉదాహరణ అని చిదంబరం మండిపడ్డారు. ప్రస్తుతం చిదంబరం పోస్ట్‌చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఈ ప్రతిపాదనలు తొలిసారిగా ప్రజల ముందుకు రాగా, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య సైతం తీవ్రంగా తప్పుబట్టారు. కొన్ని వ్యాపార సంస్థల జేబుల్లోకి భారత ఆర్ధిక వ్యవస్థ వెళ్లిపోతుందని, ఈ నిర్ణయం బ్యాంకింగ్ సంస్కరణలకు దారితీసే బదులు, వ్యవస్థను నాశనం చేస్తుందని ఆయన తన లింకెడ్ ఇన్ నోట్‌లో వ్యాఖ్యానించారు. ఎక్కువ బ్యాంకులు అవసరమే అయినప్పటికీ, పారిశ్రామిక సంస్థలను బ్యాంకింగ్‌లోకి అనుమతించడం తెలివైన నిర్ణయం కాదు.. ఎందుకంటే అలాంటి అనుసంధానం బ్యాంకింగ్ వ్యవస్థ వినాశనానికి దూరి చూపుతుందని అభిప్రాయపడ్డారు.
By November 25, 2020 at 11:09AM
No comments