భర్తను నపుంసకుడని ఆరోపించడం క్రూరత్వమే.. విడాకుల కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
హిందూ వివాహ చట్టం ప్రకారం సంసార జీవితంలో భర్త లైంగిక సామర్ధ్యంపై తప్పుడు ఆరోపణ చేయడం క్రూరత్వమేనని అభిప్రాయపడింది. ఈ చర్య అతడి ఆత్మ విశ్వాసంతోపాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదనలతో ఏకీభవించింది. ఓ జంట విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ఢిల్లీకి చెందిన ఓ జంటకు 2012లో వివాహమయ్యింది. ఆమెకు అది తొలి వివాహం కాగా, అతనికి రెండో పెళ్లి. వివాహానికి ముందు నుంచే మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆ విషయం దాచి పెట్టిందని ఆరోపిస్తూ విడాకుల కోసం భర్త పిటిషన్ వేశాడు. దీంతో ఆమె తన భర్త సంసారానికి పనికిరాడని, నపుంసకుడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆ ఆరోపణలపై స్పందించిన కోర్టు.. వైద్య నిపుణుడితో పరీక్షలు చేయించింది. మహిళ ఆరోపణలు వాస్తవం కాదని పరీక్షల్లో తేలడంతో భర్త విజ్ఞప్తి మేరకు హిందూ వివాహ చట్టం కింద కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. అయితే, అతనితో కలిసే ఉంటానని, విడాకులు రద్దు చేసి, వైవాహిక హక్కులను పునరుద్ధరించాలంటూ ఆ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై శనివారం విచారణ జరిపిన జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నరూలాల ధర్మాసనం.. కింది కోర్టు ఇచ్చిన తీర్పులో ఎటువంటి లోపం లేదని పేర్కొంది. అనంతరం ఆ మహిళ అప్పీల్‌ను కొట్టివేసింది. ఇలాంటి ఆరోపణలు చేసి తీవ్ర వేదనను, బాధను కలుగజేసిన సదరు మహిళతో కలిసి ఉండటం ప్రమాదకరమని ఆ వ్యక్తి భావించడం సహేతుకమైందేనని అభిప్రాయపడింది. వీరి వైవాహిక బంధం పునరుద్ధరించడానికి వీలులేనంతగా దెబ్బతిందని వ్యాఖ్యానించింది. ఆయన విడాకుల నోటీసుకు సహజంగా స్పందించి అటువంటి ఆరోపణలు చేశానని, దీనిని మన్నించి వైవాహిక హక్కులు పునరుద్దరించాలన్న మహిళ విన్నపాన్ని తిరస్కరించింది. ‘మానసిక క్రూరత్వం ప్రధానంగా సందర్భోచితమైంది.. ఇది మానవ ప్రవర్తన, వైవాహిక విధులు, బాధ్యతలకు సంబంధించింది. అందువల్ల, సదరు వ్యక్తుల ప్రవర్తన అటువంటి స్వభావం కలిగి ఉందో లేదో చూడటం చాలా అవసరం.. అటువంటి వారితో కలిసి జీవించాలని ఏ వ్యక్తి సహేతుకంగా భావించడు’ అని ధర్మాసనం పేర్కొంది.
By November 22, 2020 at 10:36AM
No comments