Breaking News

వైట్‌హౌస్‌లో మరో భారత సంతతి మహిళకు అత్యున్నత పదవి


అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి వ్యక్తులు కీలక పదవులను దక్కించుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి విజయం సాధించడంతో ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ ఎన్నికకానున్నారు. తాజాగా, మరో భారత సంతతికి మహిళకు వైట్‌హౌస్ నూతన పాలకవర్గంలో చోటు దక్కింది. కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగాను నియమిస్తున్నట్లు జో బైడెన్‌ శుక్రవారం ప్రకటించారు. జిల్‌కు సీనియర్‌ సలహాదారుగా, బైడెన్‌-కమలా ప్రచార బృందంలో సీనియర్‌ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. ఒబామా హయాంలోనూ మాలా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇల్లినాయిస్‌కు చెందిన మాలా.. గ్రిన్నెల్‌ కాలేజ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన ఆమె.. 2008లో ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఒబామా అధికారంలోకి వచ్చిన తర్వాత అసోసియేట్‌ అటార్నీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగానూ బాధ్యతలు చేపట్టారు. తర్వాత బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు. మాలాతో పాటు తన పాలకవర్గంలో చేరనున్న మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లను శుక్రవారం జో బైడెన్‌ వెల్లడించారు. బైడెన్‌-కమలా ప్రచార బృందంలోని క్యాథీ రస్సెల్‌ను వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్‌గా, కార్లోస్ ఎలిజోండాను అధ్యక్షుడి ప్రత్యేక సహయకుడిగా నియమించారు. వివిధ వర్గాలకు చెందిన వీరంతా అమెరికా పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కార్లోస్ ఎలిజోండా ఒబామా హాయంలో శ్వేతసౌధం సోషల్ సెక్రెటరీగా పనిచేశారు. ‘మా బృందానికి అదనపు సిబ్బందిగా వీరిని నియమించడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. విపత్కాలంలో ఉన్న అమెరికాను దిశ మార్చడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ రోజు మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి వారి అంకితభావం, భిన్న నేపథ్యాలు, అనుభవాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. న్యాయమైన, సమానమైన, ఐక్యమైన దేశాన్ని సృష్టించడానికి వీరు కృషి చేయనున్నారు’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు.


By November 21, 2020 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-elections-indian-american-mala-adiga-appointed-as-jill-bidens-policy-director/articleshow/79334808.cms

No comments