వాటర్ క్యానన్ ఆపేశాడని యువరైతుపై హత్యాయత్నం కేసు.. పోలీసుల చర్యపై విస్మయం
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నా అన్నదాతలు మాత్రం వెనక్కు తగ్గలేదు. బారికేడ్లతో అడ్డుకుని, టీయర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల కిందట హరియాణాలో భద్రతా బలగాలను సైతం లెక్కచేయకుండా ఆందోళనలో ఓ యువరైతు చూపిన ధైర్యానికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిసిన విషయం తెలిసిందే. పోలీసులు తమపై వాటర్ క్యానన్లు ప్రయోగిస్తుండగా.. నవదీప్ సింగ్ అనే యువ రైతు ఆ వాహనంపైకి అమాంత ఎక్కి నీళ్లు రాకుండా ట్యాప్ ఆపేశాడు. ఈ హఠాత్పరిణామానికి భద్రతా దళాలు దూరం నుంచి చూస్తూ చేష్టలుడిగిపోయాయి. వ్యాటర్ క్యానన్‌ను ఆపివేసిన వెంటనే, దానిపై నుంచి కిందకు దూకాడు. దానిని లక్ష్యంగా చేసుకున్న అనేక మంది రైతులు ఉత్సాహంతో ముందుకు సాగారు. అంబాలా సమీపంలో జరిగిన ఈ సంఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదుచేశారు. నవదీప్ సింగ్‌పై హత్యాయత్నం కేసు నమోదుచేయడం గమనార్హం. అల్లర్లు, కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించినందకు ఈ కేసు పెట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో దోషిగా తేలితే కనీసం యావజ్జీవిత ఖైదు పడుతుంది. తనపై హత్యాయత్నం కేసు నమోదుకావడంపై నవదీప్ స్పందించారు. ‘చదువు పూర్తయిన తరువాత నాన్నతో కలిసి వ్యవసాయం ప్రారంభించాను. నేను ఎన్నడూ ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడలేదు.. నిరసన తెలుపుతున్న రైతులు వాహనం ఎక్కడానికి వీలుగా ట్యాప్‌ను ఆపివేయడంతో వారికి ధైర్యం వచ్చింది’ అన్నారు. ‘మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం.. ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే ప్రశ్నించే అన్ని హక్కులు ప్రజలకు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఘటనలో హరియాణా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తోన్న అన్నదాతలపై టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించి అడ్డుకోవడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు.
By November 28, 2020 at 10:15AM
No comments