Breaking News

నాలుగు నెలలు చీకటి జీవితం.. హీరోగా కెరీర్ పతనం.. సుమన్ అరెస్ట్ వెనుక ఉన్నదెవరు?


సుమన్ తల్వార్... మూడు దశాబ్దాల క్రితం తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరో. ఆయన డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఇంటి ముందు క్యూలు కట్టేవారు. అందగాడు, పైగా కరాటే ఫైటర్ కావడంతో ఆయనతో కుటుంబ కథలు, యాక్షన్ సినిమాలు తెరకెక్కించేందుకు పోటీ పడేశారు. సుమన్ సినిమా అంటే బాక్సాఫీసు గళగళ మోగిపోయేది. హీరోగా పీక్స్‌ దశలో ఉన్న సమయంలో ఆయన జీవితం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది. ఓ రోజు రాత్రి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ కేసు నుంచి సుమన్ బయటికి రావడానికి చాలా కాలమే పట్టింది. దీని కారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోగా సుమన్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయింది. చివరికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. సుమన్‌ని అరెస్ట్ చేయడానికి కారణమేంటి? ఆయన్ని ప్లాన్ ప్రకారమే ఇరికించారా? అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గా మిగిలిపోయింది. Also Read: 1985, మే 19వ తేదీ శుక్రవారం నాడు ఓ షూటింగులో పాల్గొని ఇంటికొచ్చిన సుమన్ రాత్రివేళ గాఢనిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో సుమన్ లేచి తలుపు తీశారు. ఇంటి బయట చాలామంది పోలీసులు ఉండటంతో షాకైన ఆయన ఏం జరిగిందని అడగ్గా.. మీ ఇంట్లో బాంబు ఉందని మాకు సమాచారం వచ్చిందటూ లోనికి చొచ్చుకొచ్చారు. ఆ అలజడికి సుమన్ తల్లి కూడా నిద్రలేచి హాల్లోకి వచ్చారు. ఇంట్లో బాంబు దొరక్కపోయినా సుమన్‌ని స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. నేనెందుకు స్టేషన్‌కి రావాలని ఆయన నిలదీయగా.. మీపై చాలా కేసులున్నాయి.. వాటికి సంబంధించి విచారించాలని చెప్పారు. దీంతో సుమన్ వారితో వాగ్వాదానికి దిగగా.. పోలీసులకు సహకరించడం మన బాధ్యత అని తల్లి నచ్చజెప్పి పంపించారు. Also Read: రాత్రివేళ సుమన్‌ని అరగంట పాటు విచారించిన పోలీసులు తాము చెప్పేవరకు స్టేషన్లోనే ఉండాలని ఆదేశించారు. తెల్లవారిన తర్వాత సుమన్ మేనేజర్ సారథితో పాటు కొంత మంది దర్శక నిర్మాతలు ఆయన్ని కలిసేందుకు వచ్చినా పోలీసులు అనుమతించలేదు. ఆ రోజు సాయంత్రం సమయంలో సుమన్‌ని పోలీసులు సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. ఆయన చాలామంది అమ్మాయిలను లైగింకంగా వేధించేవారని, బెదిరించి బ్లూ ఫిలిమ్స్ తీశాడని అభియోగాలు మోపారు. దీంతో న్యాయమూర్తి ఆధారాలు కోరగా.. విచారణ పూర్తయిన తర్వాత సమర్పిస్తామని చెప్పారు. అయితే సుమన్‌పై ఆరోపించిన అభియోగాల్లో పోలీసులు పేర్కొన్న చేసిన సమయానికి సుమన్ బెంగళూరులో ఓ సినిమా షూటింగులో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది ఆధారాలు కోర్టుకు సమర్పించారు. అయితే పోలీసులు ఆయనపై యాంటీ గూండా యాక్ట్‌ కింద కేసు నమోదు చేయడం వల్ల కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. Also Read: దీంతో సుమన్‌ను అదే రోజు రాత్రి 9.30 గంటల సమయంలో మద్రాస్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన్ని సాధారణ నేరస్థుల మధ్య కాకుండా హంతకులు, రేపిస్టులు, గూండాలు ఉండే డార్క్ సెల్‌లో వేశారు. అలా 1985, మే 20వ తేదీ రాత్రి సుమన్ జీవితంలో కాళరాత్రిగా గడిచింది. ఆ తర్వాతి రోజు వార్తాపత్రికల్లో సుమన్‌‌పై అనేక కథనాలు వెలువడ్డాయి. తల్లి, మేనేజర్ సారథి జైలుకొచ్చి ఆయన్ని నిస్సహాయ స్థితిలో చూసి చలించిపోయారు. అమాయకుడైన తన కొడుకును అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని భావించిన సుమన్ తల్లి న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే హీరో సుమన్ జీవితం సెంట్రల్ జైలులో చీకటి సెల్‌కి పరిమితమైంది. అదే సమయంలో రాజకీయ ఖైదీగా ఆ జైలుకొచ్చిన డీఎంకే అధినేత కరుణానిధి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి.. సుమన్‌ పరిస్థితి చూసి చలించిపోయారు. సుమన్‌పై ఉన్న ఆరోపణలేంటి? మీరు ఆయన్ని ట్రీట్ చేస్తున్న విధానమేంటి?.. సుమన్ దోషి అని తేల్చకుండానే డార్క్ రూమ్‌లో ఎలా ఉంచుతారంటూ జైలు సూపరింటెండెంట్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్‌‌ని సాధారణ జైలుకి మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో జైలు సిబ్బంది దిగొచ్చారు. దీంతో సుమన్ చాలా రోజుల తర్వాత చీకటి గది నుంచి బయటికి వచ్చారు. అయితే సుమన్‌తో సినిమాలు చేసి పేరు, డబ్బు సంపాదించుకున్న చాలామంది ఆయన జైలులో ఉన్నప్పుడు పట్టించుకోలేదని, కొందరు మాత్రం అప్పుడప్పుడు జైలుకొచ్చి పరామర్శించి వెళ్లేవారని ఆయనకు బాగా తెలిసిన వారు చెబుతుంటారు. అయితే అలాంటి విపత్కర సమయంలో ఇద్దరు హీరోయిన్లు మాత్రం సుమన్‌కు మద్ధతుగా నిలబడ్డారు. సుమన్ చాలా మంచివారని, అలాంటి పని చేశారంటే తాను నమ్మనని, దీని వెనుక ఏదో కుట్ర ఉందంటూ.. హీరోయిన్ సుహాసిని స్టేట్‌మెంట్ ఇచ్చారు. సుమలత కూడా సుమన్‌‌కి మద్దతుగా నిలబడ్డారు. దీంతో కొడుకు విడుదల కోసం సుమన్ తల్లి చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పెరిగింది. దేశంలోనే ప్రముఖ న్యాయవాదులైన రాంజెఠ్మలానీ, సోలీ సొరాబ్జీ వంటి లాయర్ల గైడెన్స్‌తో తమిళనాడుకు చెందిన రామస్వామి అనే లాయర్.. కోర్టులో గట్టిగా వాదించి సుమన్‌కు బెయిల్ మంజూరయ్యేలా చేశారు. దీంతో నాలుగు నెలల తర్వాత సుమన్‌ జైలు నుంచి బయటికొచ్చారు. యాంటీ గూండా యాక్ట్ కింద అరెస్టయిన వ్యక్తికి బెయిల్ రావడం అదే తొలిసారట. అలా తల్లి రాజీలేని పోరాటంతో సుమన్ 1985, అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నాలుగు నెలల కాలంలో ఆయన అనుభవించిన చీకటి జీవితం కారణంగా ఏకంగా హీరోగా సినీ కెరీర్‌నే కోల్పోయారు సుమన్. దర్శక నిర్మాతలు ఆయనకు మొహం చాటేయడంతో చాలా రోజుల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా మునుపటి క్రేజ్‌ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. 1959, ఆగస్టు 28న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన సుమన్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150 సినిమాలకు పైగా హీరోగా నటించారు. తెలుగులో హీరోల్లో మొట్టమొదటిగా కరాటే బెల్ట్ సాధించింది ఆయనే. అయితే సినిమాల్లో కూడా ఊహించని విధంగా చోటుచేసుకున్న ఈ ఘటన ఆయన జీవితాన్ని మాత్రం పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. Also Read:



By November 25, 2020 at 10:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/did-telugu-hero-suman-act-in-blue-films-what-is-the-reason-for-going-to-jail/articleshow/79401759.cms

No comments