కోతి ముఖంతో వింత జీవికి జన్మనిచ్చిన మేక.. హనుమంతుడి అవతారమని పూజలు
కోతి ముఖం, మనిషిని పోలిన విచిత్ర జీవికి ఓ మేక జన్మనిచ్చిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఈ విచిత్ర రూపాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. అంతేకాదు, ఇది దేవుడి మహత్మ్యం అని, కలియుగంలో హనుమంతుడి అవతరామని భావించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే, జన్మించిన కొద్దిసేపటికే ఈ వింత జీవి మృతి చెందింది. అయినా ఆ జీవిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి, నమస్కారం చేస్తూ కానుకులు వేయడం గమనార్హం. కాన్పూర్ జిల్లా జహంగీరాబాద్ గ్రామంలోని సీతారామ్ అనే రైతుకు చెందిన ఒక మేక విచిత్ర జీవికి రెండు రోజుల కిందట జన్మనిచ్చింది. ఈ విచిత్రమైన రూపాన్ని చూసిన సీతారామ్ ఆశ్చర్యపోయాడు. క్షణాల్లోనే ఈ వార్త ఊరంతా పాకిపోయింది. చుట్టపక్కల గ్రామాలకు కూడా తెలిసింది. దీంతో దానిని చూసేందుకు సీతారామ్ ఇంటికి జనం క్యూకట్టారు. వారిలో కొంత మంది దానిని కలియుగంలో హనుమంతుని అవతారం అంటూ వదంతులు సృష్టించారు. దీంతో ఆ వింతజీవికి స్థానికులు పూజలు చేయడం ప్రారంభించారు. అంతేకాదు, కరోనా వైరస్ మహమ్మారి అంతానికి ఇది సంకేతమని ప్రచారం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించడంతో వేలాది రూపాయాలు కానుకల రూపంలో వచ్చింది. అయితే, కొద్ది సేపటికే ఆ వింతజీవి చనిపోయింది. దీంతో ఆ జీవిని ఊరేగింపుగా తీసుకెళ్లి ఖననం చేశారు.
By November 25, 2020 at 09:01AM
No comments