Breaking News

సుప్రీం సెలవుల జాబితాలో సంక్రాంతి.. తొలిసారి ఓ దక్షిణాది పండుగకు చోటు


సర్వోన్నత న్యాయస్థానం సెలవుల జాబితాలో తొలిసారి ఓ దక్షిణాది పండుగకు చోటు లభించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో వేడుకగా జరుపుకునే సంక్రాంతి పండుగ ఉంది. సుప్రీంకోర్టు శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా.. వేసవి, దసరా సెలవులు ఉంటాయి. డిసెంబరు ఆఖరు వారంలో క్రైస్తవుల పండగ క్రిస్మస్‌, కొత్త సంవత్సరాది జనవరి 1న సెలవులు ఉంటాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే దసరా, దీపావళి, మహా శివరాత్రి, శ్రీరామనవమి, హోళీ, రంజాన్‌, బక్రీద్‌, మొహర్రం, గుడ్‌ఫ్రైడే, గురునానక్‌ జయంతి, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, గాంధీ జయంతికి ఏటా సెలవులు ఇస్తారు. ఇదిలా ఉండగా, 2021 ఏడాదికి గానూ సుప్రీంకోర్టు క్యాలెండర్‌ను కోర్టు సెక్రటరీ జనరల్‌ గురువారం విడుదల చేశారు. ఇందులో తొలిసారి సంక్రాంతి, అసోం పర్వదినం బిహుకు సెలవు ప్రకటించారు. అసోంలో బిహు జనవరి 14న, దక్షిణాదిలో సంక్రాంతి 15ను సెలవుగా పేర్కొన్నారు. 2021లో సుప్రీంకోర్టుకు మే 14 నుంచి జూన్‌ 30 వరకు వేసవి సెలవులు, డిసెంబరు 19 నుంచి 2022 జనవరి 1 వరకు క్రిస్మస్‌, నూతన సంవత్సరం సెలవులుగా నిర్ణయించారు. ఇదిలా ఉండగా శని ఆదివారాల సెలవుల్నీ కలుపుకొంటే సర్వోన్నత న్యాయస్థానం 175 రోజులపాటు అందుబాటులో ఉండదని, మరోమాటలో నెలకు 16 రోజులు మాత్రమే పని చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి సెలవులు 45 రోజులు, శీతకాల విరామం పక్షం రోజులు, హోలీకి వారం, దసరా, దీపావళి పర్వదినాలకు చెరో పది రోజుల వంతున సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంపై చిరకాలంగా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.


By November 27, 2020 at 12:22PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sankranti-in-supreme-court-holidays-list-in-a-first-time-south-indian-festival/articleshow/79442190.cms

No comments