Breaking News

అమెరికా పౌరసత్వం మరింత క్లిష్టం.. మౌఖిక పరీక్షలో పెరిగిన ప్రశ్నలు.. కొన్నింటికి ఆప్షన్స్ రద్దు!


అమెరికా పౌరసత్వానికి నిర్వహించే మౌఖిక పరీక్షను మరింత కఠినతరం చేశారు. ఈ మేరకు అమెరికా పౌరసత్వం-వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) కీలక సవరణలు చేసింది. తాజా మార్పుల ప్రకారం.. అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేవారు ఇకపై మౌఖిక పరీక్షలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుంది. డిసెంబరు నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది. మౌఖిక పరీక్షలో 2008 నుంచి ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వం, చరిత్ర, భౌగోళిక స్వరూపం, పౌరుల హక్కులు-విధులు వంటి అంశాలపై 100 ప్రశ్నలు ఉండేవి. ప్రతి 10ప్రశ్నల్లో ఆరింటికి సరైన సమాధానం చెప్పాలనే నిబంధన ఉంది. తాజాగా, ఆ ప్రశ్నల సంఖ్యను 128కి పెంచారు. డిసెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పరీక్షలో ప్రతి 20 ప్రశ్నల్లో పన్నెండింటికి సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసిన యూఎస్సీఐఎస్ కొన్ని కీలక ప్రశ్నలకు ఐచ్ఛికాలను కూడా తొలగించింది. అయితే, ప్రశ్నలు సంఖ్య పెరిగినా.. అర్హత మార్కులు మాత్రం 60 శాతమే. తాజా మార్పుల వల్ల పౌరసత్వ మౌఖిక పరీక్ష మరింత కఠినతరమవుతుందని, రాజకీయ రంగును పులుముకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించే విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 2019 సెప్టెంబరు 30తో పూర్తయిన 12 నెలల కాలంలో 61,843 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. ఆ సమయంలో అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో ఇది 7.5 శాతం. అంతకు ముందు ఏడాది 52,194 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం దక్కించుకున్నారు. ఇది మొత్తం విదేశీయుల్లో 6.5 శాతంగా ఉంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. 65 లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు, కనీసం 20 సంవత్సరాల చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కలిగిన వ్యక్తులకు పౌరసత్వం లభిస్తుంది. ఈ దరఖాస్తుదారులు 10 ప్రశ్నలు అడిగితే ఇందులో 60 శాతం స్కోర్ సాధించాలి. ‘ 2018 నుంచి పౌరసత్వ మౌఖిక పరీక్షను సవరించడంపై పనిచేసింది.. ఈ ప్రక్రియ న్యాయపరంగా, పారదర్శకంగా ఉండేలా వయోజన విద్యారంగంలో నిపుణుల సామర్ధ్యంపై ఆధారపడింది’ అని పాలసీ డిప్యూటీ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో చెప్పారు. సహజంగా వలసదారులు అమెరికన్ సమాజంలో పూర్తిగా స్వయం సభ్యులుగా మారడానికి అనుమతిస్తుంది.. పుట్టుకతోనే పౌరులకు లభించే సమానమైన హక్కులు, బాధ్యతలు వీరికి దక్కుతాయి.. ఈ బాధ్యతలను సిద్ధం చేసే న్యాయమైన పరీక్షను అందజేయడం మా సంస్థకు చాలా ముఖ్యమైనది’ అని వ్యాఖ్యానించారు.


By November 17, 2020 at 08:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/new-us-citizenship-test-is-tougher-with-political-tilt-say-experts/articleshow/79254847.cms

No comments