సీబీఐకి నో చెప్పిన ఎనిమిది రాష్ట్రాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఏదైనా కేసులో దర్యాప్తునకు రాష్ట్రాల తప్పనిసరని, ఇది సమాఖ్య సూత్రానికి అనుగుణంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం పేర్కొంది. రాష్ట్రాల సమ్మతి లేనిదే సీబీఐ అధికార పరిధిని కేంద్రం బలవంతంగా విస్తరించలేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎస్పీఈ) సెక్షన్ 5,6లను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఉటంకించింది. కేంద్ర పరిధిని మించి డీఎస్పీఈ సభ్యుల అధికారాలు, అధికార పరిధిని ఒక రాష్ట్రానికి విస్తరించడానికి సెక్షన్ 5 కేంద్ర ప్రభుత్వానికి వీలు కల్పిస్తున్నప్పటికీ, ఇది అనుమతించబడదు.. సెక్షన్ 6 కింద ఒక రాష్ట్రం అటువంటి విస్తరణకు సమ్మతించాలి’ అని ధర్మాసనం వివరించింది. ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం, పంజాబ్ రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతి ఉపసంహరించుకున్న వేళ ఈ తీర్పును సుప్రీం వెలువరించడం విశేషం. ‘సహజంగానే, ఈ నిబంధనలు రాజ్యాంగం సమాఖ్య స్వభావానికి అనుగుణంగా ఉంటాయి.. ఇది రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాలలో ఒకటిగా ఉంది’ అని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా తమపై అవినీతి అరోపణలు కేసును సీబీఐ నమోదుచేసిందని పేర్కొంటూ యూపీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే, నిందితుల అభ్యర్థనలను తోసిపుచ్చిన సుప్రీం.. అవినీతి నిరోధక చట్టం ప్రకారం డీఎస్పీఈ-1989 సభ్యుల అధికారాలు, అధికార పరిధిని యూపీ ప్రభుత్వం సీబీఐకి సాధారణ అనుమతి ఇచ్చిందని పేర్కొంది. దాడుల విషయంలో కూడా అదే ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితో తప్ప, ఆ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన కేసులలో దర్యాప్తు చేపట్టకూడదు. అందువల్ల ప్రైవేటు వ్యక్తుల విషయానికొస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఎటువంటి ఆంక్షలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ ధర్మాసనం కీలక అంశాలను వెల్లడించింది. సాధారణ సమ్మతి అమలులో ఉన్నప్పుడు డీఎస్పీఈ చట్టం సెక్షన్ 6 ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి మినహాయింపులు ఉండవని పేర్కొంది.
By November 19, 2020 at 07:04AM
No comments