Breaking News

నేడు భారత్ బంద్.. విధులకు దూరంగా 25 కోట్ల మంది కార్మికులు


కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక యూనియన్లు సమ్మె చేపట్టాయి. ఈ సమ్మెలో 25 కోట్ల మందికిపైగా కార్మికులు పాల్గొననున్నట్టు పది కేంద్ర కార్మిక యూనియన్లతో కూడిన ఐక్యవేదిక బుధవారం ప్రకటించింది. బీజేపీ అనుబంధ యూనియన్ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) తప్ప మిగతా కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి సమ్మెకు మద్దతు ప్రకటించింది. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ, కార్మిక చట్టాలు తదితరాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా పలు డిమాండ్లు చేస్తూ ఈ సమ్మెను చేపడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్కీమ్‌ వర్కర్లు, గృహ, నిర్మాణ, బీడీ కార్మికులు, హాకర్లు, వెండార్లు, వ్యవసాయ కార్మికులు, స్వయం ఉపాధి పొందిన వారు రాస్తా రోకో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆటో, టాక్సీ డ్రైవర్లు కూడా వాహనాలు తిప్పరాదని నిర్ణయించారు. సమ్మెతో బ్యాంకింగ్‌ సేవలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సమ్మెలో అఖిల భారత బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, అఖిల భారత బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పాల్గొంటున్నాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తోన్న లక్షలాది మంది రైతులు గురువారం ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలియజేస్తారు. ఇందులో 500 సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారని అఖిల భారత కిసాన్‌ సభ ప్రకటించింది. అటు ఆందోళనల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా హరియాణా, యూపీ ప్రభుత్వాలు తమ సరిహద్దుల్ని మూసివేశాయి. పంజాబ్, హరియాణాల నుంచి పెద్దఎత్తున ట్రాక్టర్లలో బయల్దేరిన రైతులు దానిలో తమ ఆహార, వసతికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ట్రాక్టర్లను ఎక్కడ అడ్డుకుంటే అక్కడే ధర్నా చేస్తామని, చట్టాలను రద్దు చేసేవరకు వెనక్కి వెళ్లేది లేదని ప్రకటించారు. రాష్ట్రాల సరిహద్దులో పరిణామాల చిత్రీకరణకు డ్రోన్‌ కెమెరాలను వినియోగించనున్నారు. దేశ రాజధాని దిశగా కదం తొక్కుతున్న రైతులపై హరియాణాలో పోలీసులు బుధవారం వాటర్ క్యానన్లు ప్రయోగించారు. హరియాణా సరిహద్దు దాటగానే రహదారిపై బైఠాయించి, వాహనాల రాకపోకల్ని స్తంభింపజేశారు. బారికేడ్లను ఛేదించుకుని ముందుకు వచ్చిన రైతుల్ని చెదరగొట్టడానికి పోలీసులు కురుక్షేత్రలో వ్యాటర్ కానన్లు ప్రయోగించాల్సి వచ్చింది. రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, అందరికీ పెన్షన్‌, ఎన్‌పీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ పథకం పునరుద్ధరణ, ఆదాయ పన్ను చెల్లించని కుటుంబాలకు నెలకు 7,500 నగదు బదిలీ, నిరుపేదలకు నెలకు ఒక్కొక్కరికి 10 కిలోల ఉచిత రేషన్‌, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏడాదిలో 200 రోజులకు పెంచాలనే డిమాండ్‌తో ఈ సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.


By November 26, 2020 at 07:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/who-participated-and-what-may-be-affected-due-to-bharat-bandh-today/articleshow/79419546.cms

No comments