సాఫీగా అధికార మార్పిడి.. కానీ ఇప్పుడు కాదు 2024లో: మైక్ పాంపియో సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించినా.. అధికార బదలాయింపునకు ట్రంప్ ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. తాజాగా, అధికార మార్పిడిపై ట్రంప్ బృందంలోని కీలక నేత, విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత అధికార మార్పిడి సాఫీగా జరుగుతుందన్న ఆయన.. జో బిడెన్ విజయాన్ని గుర్తించడానికి నిరాకరించారు. అధికారంలో ఉంటారని పేర్కొన్నారు. ‘రెండోసారి పాలన పూర్తయిన తర్వాత అధికార మార్పిడి సాఫీగా జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఓ మీడియా సమావేశంలో మంగళవారం పాంపియో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు విదేశాంగ శాఖ పనితీరును నిర్ధారించడానికి అవసరమైన మార్పులపై ప్రపంచానికి విశ్వాసం ఉండాలి ... జనవరి 20న మధ్యాహ్నం తర్వాత అధ్యక్షుడి పదవీకాలం పూర్తవుతుంది’ అని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు జో బైడెన్‌కు దాదాపు అమెరికా మిత్ర దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే, దీనిని ట్రంప్ అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. దీనిపై మీడియా స్పందిస్తూ.. ప్రపంచంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని ఇకపై అమెరికా ప్రకటించగలదా అని ప్రశ్నించగా.. ఇది హాస్యాస్పదంగా ఉందని పాంపియో బదులిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు సురక్షితంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేలా తమ విభాగం శ్రద్ధ వహిస్తుంది.. అలా జరిగేలా చూడటానికి మా అధికారులు తమ ప్రాణాలను పణంగా పెడతారు అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ కు మద్దతును కూడగట్టేందుకు 7 దేశాల పర్యటనకు వెళ్లాలని పాంపియో నిర్ణయించుకున్నారు. జోకు శుభాభినందనలు చెబుతూ యూరప్ దేశాధినేతలు కాల్ చేసిన నేపథ్యంలో, పాంపియో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. శుక్రవారం పారిస్‌కు బయలుదేరనున్నానని, అక్కడి నుంచి ఇస్తాంబుల్, జార్జియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ దేశాలకు వెళతానని ఆయన స్పష్టం చేశారు. తన పర్యటనలో ట్రంప్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, ఆయా దేశాలతో మితృత్వం, సహాయ సహకారాలను ప్రస్తావించనున్నట్టు పాంపియో మీడియాకు వెల్లడించారు. ఫ్రాన్స్ సహా పలు ఐరోపా దేశాలు ట్రంప్‌ను విభేదిస్తూ, బైడెన్‌కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అమెరికాతో ద్వైపాక్షిక బంధం కొనసాగాలంటే, అధ్యక్షుడిగా బైడెన్ ఉండాలని పలు దేశాధినేతలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ట్రంప్‌కు మిత్ర దేశాలుగా పేరున్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ, సౌదీ రాజు మహమ్మద్ బిన్ సుల్తాన్, టర్కీ అధ్యక్షుడు తయాపీ ఎర్డోగన్ తదితరులు కూడా బైడెన్‌కు శుభాకాంక్షలు తెలపడంతో జరిగిన నష్టాన్ని నివారించాలని పాంపియో ఈ పర్యటన చేస్తున్నారు.
By November 11, 2020 at 12:21PM
No comments