Breaking News

ఈ విషయంలో మారో మాటలేదు.. నితీశ్ కుమారే సీఎం: స్పష్టం చేసిన బీజేపీ


బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించినా.. జేడీ(యూ)కి కంటే తక్కువ సీట్లు రావడంతో మళ్లీ సీఎం అవుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఊహాగానాలను బీజేపీ కొట్టిపారేసింది. కచ్చితంగా నితీశ్ సీఎంగా ఉంటారని, మరో వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ స్పష్టం చేశారు. జేడీ (యూ)కు సీట్లు తగ్గినంత మాత్రాన, ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ను తొలగించి, మరొకరిని ఆ పదవిలో కూర్చోబెట్టే ప్రశ్నే లేదని అన్నారు. ‘నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారు. ఇది మేమిచ్చిన మాట. ఈ విషయంలో ఎటువంటి సందేహమూ లేదు’ అని సుశీల్ మోదీ కుండబద్దలు కొట్టారు. ఎన్డీఏ కూటమి మొత్తం 125 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 74, జేడీ(యూ) 43 సీట్లకు పరిమితమయ్యింది. ఇతర ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించిన నేపథ్యంలో, సీఎంగా కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొస్తారనే ప్రచారం జరుగుతోంది. ‘కొంతమంది అధిక సీట్లను గెలుస్తారు. కొంతమంది తక్కువ సీట్లను గెలుస్తారు. అయితే, బీహార్‌లో మేము సమాన భాగస్వాములం’ అని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, బీహార్‌లో ఇంత వరకూ బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. నితీశ్ సహకారం లేకుంటే, అధికారంలో ఉండే అవకాశాలు బీజేపీకి ఎంతమాత్రమూ లేవు. అయితే, మారిన సమీకరణాల నేపథ్యంలో నితీశ్ సీఎంగా ఉన్నా ప్రధాన శాఖలతో పాటు అధికారాలన్నీ బీజేపీ చేతిలోనే ఉంటాయని, ప్రస్తుతానికి బీహార్‌లో బీజేపీ బలపడేందుకు ఈ మాత్రం సరిపోతుందని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నితీశ్ స్థానంలో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించి, బీజేపీ నేతను ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, నితీశ్ స్థానంలో అంతటి సమర్ధత కలిగిన నేత బీజేపీలో ఎవరున్నారనే చర్చ జరుగుతోంది.


By November 11, 2020 at 01:07PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-election-result-nitish-kumar-will-be-chief-minister-it-was-our-commitment-says-bjp/articleshow/79167097.cms

No comments