డిజిటల్ మీడియాపై కేంద్రం నిఘా.. యూట్యూబ్, ఓటీటీలు సమాచార శాఖ పరిధిలోకి
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆన్‌లైన్ ఛానెల్స్, వెబ్‌సైట్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఛానల్స్‌పై నిఘాను ఉంచడానికి యూట్యూబ్, ఓటీటీలను సమాచార శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా నిబందనల ప్రకారం యూట్యూబ్ ఛానెల్స్ ఏర్పాటుచేయాలంటే సమాచార శాఖ అనుమతి తప్పనిసరి. అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేయడానికి, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఎవరు పడితేవారు యూట్యూబ్ ఛానెల్స్ ఏర్పాటు చేయడం కుదరదు. ఆన్‌లైన్ ఛానెల్స్, వెబ్‌సైట్‌లను సమాచార శాఖ పరిధిలోకి తేవడంతో సాంప్రదాయ మీడియా ప్రయోజనాలను డిజిటల్ మీడియాకు కల్పించే అవకాశం ఉంది. అలాగే, ఏర్పాటుకు లైసెన్సింగ్ విధానం తీసుకొచ్చే వీలుంది. ఈ రంగంలోనూ విదేశీ పెట్టుబడుల పరిమితి పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతేడాది న్యూస్ వెబ్‌సైట్లను సైతం అధికారిక నియంత్రణల పరిధిలోకి తీసుకొచ్చే ముసాయిదా బిల్లును కేంద్రం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల విషపూరిత విద్వేషాన్ని, ఉగ్రవాదం, హింసను ‘ఉద్దేశపూర్వకంగా ప్రేరేపిస్తోంది’ అంటూ సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. అలాగే మొదట వెబ్ ఆధారిత మీడియాను కోర్టు నియంత్రించాలని విజ్ఞప్తి చేసింది. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన నిబంధనలను రూపొందించే అంశాన్ని పార్లమెంట్‌కు వదిలేయాలంటూ కోరింది. ‘వెబ్ ఆధారిత డిజిటల్ మీడియా గురించి కచ్చితమైన పరిశీలన లేదు. విషపూరితమైన విద్వేషాన్ని వ్యాప్తి చేయడంతో పాటు హింస, ఉగ్రవాదానికి కారణమయ్యే ఉద్దేశపూర్వక ప్రేరేపణకు ఆ మీడియా దోహదం చేస్తోంది. వ్యక్తులు, సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. వాస్తవానికి ఈ తీరు చాలా ప్రబలంగా ఉంది’ అంటూ అఫిడవిట్‌లో కోర్టుకు వెల్లడించింది.
By November 11, 2020 at 11:43AM
No comments