నిషేధిత అంశాలలో మీడియా జోక్యం చేసుకుంటోంది.. సుప్రీంలో కేంద్రం వాదన
న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసిన కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు రూ.1 జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. వాక్-స్వాతంత్ర హక్కు ఈ రోజుల్లో దుర్వినియోగమవుతోందని అక్టోబరు 8న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డే వ్యాఖ్యానించారు. తాజాగా, ఇదే అంశంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మంగళవారం సుప్రీంకోర్టులో మాట్లాడుతూ.. మీడియా హద్దులు దాటి, నిషేధిత అంశాల్లో జోక్యం చేసుకుంటోంది అని అన్నారు. వాక్ స్వాతంత్య్ర హక్కును దుర్వినియోగం చేయడం పరిపాటిగా మారిందని జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, బీఆర్ గవాయ్, కృష్ణ మురారీల త్రిసభ్య ధర్మాసనం ముందు వాదించారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై టీవీ ఛానెళ్ల కథనాలను ఈ సందర్భంగా ఏజీ ప్రస్తావించారు. న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రైవేట్ వాట్సాప్ సంభాషణతో నిందితులకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని, ఇది న్యాయ వ్యవస్థకు చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యమైన కేసులలో తీర్పులు ఇవ్వడానికి ముందే సుప్రీంకోర్టుకు సలహాదారుల మాదిరిగా కథనాలను ప్రచురించడాన్ని అటార్నీ జనరల్ ప్రస్తావించడం గమనార్హం. ‘ఓ కీలక కేసు సుప్రీంకోర్టు విచారణకు షెడ్యూల్ చేసిన ప్రతిసారి మీడియాలో దీనిపై పెద్ద పెద్ద కథనాలు ప్రచురించి.. సాధ్యమయ్యే నిర్ణయాల లాభాలు, నష్టాలు,కోర్టు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చిస్తారు. ఏ నిర్ణయాలు తీసుకోవాలో (రచయితలు) సుప్రీంకోర్టుకు సలహా ఇస్తున్నాయి.. ఇవన్నీ నిషేధించారని, ఈ సమస్యలను చర్చించాల్సిన అవసరం ఉంది’అని వ్యాఖ్యానించారు. అటార్నీ జనరల్ ధోరణి చూస్తే ముఖ్యమైన కేసులలో కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సీనియర్ న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని తప్పుబడుతున్నట్టుగా ఉంది. విద్వేషాలను రొచ్చగొట్టేలా ముస్లింలకు వ్యతిరేకంగా సాగుతోన్న ప్రచారాలను అరికట్టి, నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గతవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన సమస్యలపై తీవ్రంగా స్పందించింది. ఈ రోజుల్లో వాక్ స్వాతంత్రం దుర్వినియోగం అవుతోన్న స్వేచ్ఛ అని వ్యాఖ్యలు చేసింది.
By October 14, 2020 at 07:11AM
No comments