Breaking News

కోవిడ్ నుంచి కోలుకుని ఎన్నికల గోదాలోకి దూకిన ట్రంప్.. వైట్‌హౌస్ వద్ద భారీ సమావేశం


కరోనా వైరస్ బారినపడి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు శనివారం తొలిసారి బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. వైట్‌హౌస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు తరలివచ్చారు. దాదాపు పది రోజుల తర్వాత ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌తో సహా ఆయన మద్దతుదారులు చాలా మంది మాస్క్ ధరించారు. దాదాపు 20 నిమిషాలు పాటు జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను చాలా గొప్పగా భావిస్తున్నాను అని హర్షం వ్యక్తం చేశారు. మరో నాలుగేళ్లు అధికారంలో ఉండాలంటే మీరు వెళ్లి నాకు ఓటేయండి.. మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటా అని అన్నారు. కరోనా బారిపడ్డ డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా కోలుకోకముందే బయటకు రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, అధ్యక్షుడి వల్ల వైరస్ వ్యాప్తి ముప్పు ఉండబోదని వైట్‌హౌస్ వైద్యుడు డాక్టన్ సీన్ కాన్లే ప్రకటించారు. ట్రంప్‌లో వైరస్ తీవ్రత తగ్గిపోయిందని, యాక్టివ్‌గా ఉన్నట్టు అధారాల్లేవని అన్నారు. అయితే, ప్రెసిడెంట్ పూర్తిగా వైరస్ నుంచి కోలుకున్నట్టు మాత్రం వెల్లడించలేదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా మార్గదర్శకాల ప్రకారం.. తేలికపాటి లేదా మోస్తరు కోవిడ్ లక్షణాలున్నవారికి ఒకసారి 24 గంటలుపాటు జ్వరం రాకుండా అదుపులోకి వచ్చినట్టయితే 10 రోజుల తర్వాత చికిత్స నిలిపివేయవచ్చు. ట్రంప్‌నకు సైతం మోస్తరు లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ఇక, శనివారం జరిగిన కార్యక్రమం ఫ్లోరిడాలో సోమవారం జరబోయే ర్యాలీకి రిహార్సిల్ వంటింది. ఫ్లోరిడా తర్వాత మంగళ, బుధవారాల్లో పెన్సుల్వేనియా, ఐయోవాలో బహిరంగ సభలో ట్రంప్ పాల్గొంటారు. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ మండిపడ్డారు. ఆయన నిర్లక్ష్య వైఖరి అమెరికా ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించందని దుయ్యబట్టారు. అయితే, ఈ విమర్శలను ట్రంప్ తిప్పికొట్టారు. ‘భయంకరమైన ఈ చైనా వైరస్‌ను అమెరికా ఓడించబోతోందని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.. ఇది కనుమరుగవుతుంది. ఇది కనుమరుగవుతోంది’ అని వ్యాఖ్యానించారు.


By October 11, 2020 at 11:15AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-1st-event-after-covid-diagnosis-us-president-donald-trump-tugs-off-mask/articleshow/78600158.cms

No comments