ఢిల్లీ-బెంగళూరు విమానంలో ప్రసవం.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ఢిల్లీ- బెంగళూరు విమానంలో ప్రయాణిస్తోన్న ఓ గర్బిణి మార్గమధ్యలోనే ప్రసవించింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఇండిగో 6ఈ 122 విమానంలో ఓ మహిళ నెలలు నిండకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని ఇండిగో ఎయిర్ లైన్సు అధికారులు వెల్లడించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. విమానం బుధవారం రాత్రి 7.30 గంటలకు బెంగళూరుకు చేరిన వెంటనే తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. రాత్రి 6.10 గంటలకు మహిళ ప్రసవించిందని ఇండిగో విమాన కెప్టెన్ క్రిష్టోఫర్ ట్వీట్ చేశారు. తల్లీ బిడ్డలకు తమ సిబ్బంది ప్రథమ చికిత్స చేశారని తెలిపారు. అంతేకాదు, తమ విమానంలో ఓ తల్లి బిడ్డకు జన్మనివ్వడం తమకు గర్వకారణమని కెప్టెన్ సంతోషం వ్యక్తం చేశారు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే మహిళకు పురిటి నొప్పులు రావడంతో సిబ్బంది నిమిషాల్లోనే ఏర్పాట్లు చేశారు. అదృష్టవశాత్తూ అదే విమానంలో ఓ వైద్యురాలు ఉండటంతో కలిసొచ్చింది. విమానంలో ప్రయాణిస్తోన్న డాక్టర్ శైలజ వల్లభాని, క్యాబిన్ క్యూ సిబ్బంది సాయంతో పురుడుపోసింది. ఈ సమయంలో విమాన ప్రయాణానికి కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడలేదన్నారు. ‘6E-122 ఢిల్లీ-బెంగళూరు విమానంలో మగబిడ్డకు ఓ మహిళ జన్మనిచ్చిందని సమాచారం అందింది... బుధవారం రాత్రి 7.40 కు విమానం బెంగళూరుకు చేరింది. అన్ని కార్యకలాపాలు సాధారణంగా జరిగాయి.. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. అందరికీ అభినందనలు.. శిక్షణ బృందం ప్రథమ చికిత్స నిర్వహించింది’ అని ఇండిగో తెలిపింది.
By October 08, 2020 at 07:55AM
No comments