Breaking News

హథ్రాస్ ఘటన.. ఓ జర్నలిస్ట్, రాజకీయ నేతపై దేశద్రోహం కేసు


హథ్రాస్ ఘటనలో యూపీ పోలీసుల వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా, బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నేతలు, మీడియా ప్రతినిధులపై దేశద్రోహం, కుట్రపూరిత నేరం, అల్లర్లకు పురిగొల్పడం వంటి కేసులను నమోదు చేశారు. హథ్రాస్ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఓ జర్నలిస్ట్, రాజకీయ నేత సహా గుర్తుతెలియని పలువురిపై దేశద్రోహం కేసు నమోదుచేయడం చర్చనీయాంశమయ్యింది. చందపా పోలీస్ స్టేషన్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్ సహా మొత్తం 680 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు ఆదివారం నమోదయ్యాయి. సోమవారం మరో 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా.. వీటిలో 13 సోషల్ మీడియా పోస్ట్‌లకు సంబంధించినవే కావడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతకు విఘాతం కలిగించడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం ఏడీజీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌ల వల్ల రాష్ట్రంలో అలజడి సృష్టించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇక, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం రాష్ట్రంలో కుట్రపూరితంగా కుల, మత విభజన తీసుకొచ్చేందుకు విదేశీ నిధులను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందస్తు ప్రణాళికతోనే కుట్రపూరితంగా రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఓ పోలీస్ అధికారి అన్నారు. అంతేకాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రకటనలు ఇవ్వాలని, అలా చేస్తే రూ.50 లక్షలు ఇస్తామని ఓ రాజకీయ నేత బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వ చర్య పట్ల సంతృప్తి చెందలేదని ప్రకటన ఇవ్వాలని ఒక జర్నలిస్ట్ బాధితురాలి సోదరుడిని వారి తండ్రిని ఒప్పించమని కోరినట్టు ఆరోపించారు. వైద్య నివేదికలు అత్యాచారం జరిగినట్టు ఖచ్చితంగా చెప్పలేదని, ఈ కుటుంబం మాత్రం వాస్తవాలను వక్రీకరించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.


By October 06, 2020 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uttar-pradesh-police-sedition-charge-on-politician-reporter-in-hathras-case/articleshow/78505148.cms

No comments